కరోనా దెబ్బకు కోలీవుడ్ విల విల.. ఒక్కరోజే ముగ్గురు సినీ ప్రముఖుల మృతి

Update: 2021-05-08 03:43 GMT
కరోనా దెబ్బకు కోలీవుడ్ వణికి  పోతోంది. వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. తాజాగా ఒకే రోజు కోలీవుడ్ కు చెందిన ముగ్గురు సినీ ప్రముఖులు కరోనా సోకి మృతిచెందారు. కొద్ది రోజుల కిందట కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్   కరోనా  బారినపడి కన్నుమూయడంతో కోలీవుడ్ దిగ్బ్రాంతి చెందింది. కె.వి.ఆనంద్ మరణాన్ని మరచిపోకముందే తాజాగా కోలీవుడ్ లో ఒక్కరోజే ముగ్గురు సినీ రంగానికి చెందిన వ్యక్తులు చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

ఇటీవల కరోనా బారిన పడ్డ ప్రముఖ హాస్యనటుడు పాండు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.  గురువారం ఆయన చికిత్స ఫలించక కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. ఆయన స్వగ్రామం నామక్కల్ జిల్లా కుమార పాలేయం. 'కరైయల్లాం షెణ్బ గపూ' చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పాండు ఆ సినిమా విజయంతో వెనుదిరిగి చూసుకోలేదు.  తమిళ హాస్యనటుల్లో ప్రముఖుడిగా గుర్తింపు సాధించారు. ఈయన తమిళ అగ్ర హీరోలు రజినీకాంత్, కమలహాసన్, విజయ్,  అజిత్ తదితరుల సినిమాల్లో నటించారు.

అలాగే కోలీవుడ్ ప్రముఖ గాయకుడు కోమగన్ వైరస్ బారిన  పడే కన్నుమూశాడు. చేరన్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ఆటోగ్రాఫ్ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగులో రవి తేజ హీరోగా  రీమేక్ అయ్యింది. తమిళ మాతృకలో కోమగన్ పాడిన 'ఒవ్వెరు  పుక్కళుమే' పాట  సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత కోమగన్ కెరీర్ మారిపోయింది. దివ్యాంగుడు అయిన కోమగన్ కోలీవుడ్లో మంచి గాయకుడిగా గుర్తింపు సాధించారు.కొలీవుడ్ సీనియర్ నిర్మాత ఇబ్రహీం కరోనాతో మరణించారు. ఈయన 1980లో నిర్మించిన ఒరుతలై రాగం మూవీ ఒక సంచలనం. ఆ సినిమా ద్వారానే హీరోగా  టి.రాజేందర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కరోనా బారిన పడి సినీ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు మృత్యువాత పడడంతో సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News