క్రిస్మస్ బాక్సాఫీస్: డిసెంబర్ లో ఈసారి తగ్గేదే లే..!

Update: 2021-08-04 07:32 GMT
2020 లో కరోనా నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయని స్టార్ హీరోలందరూ.. 2021 దసరా నుంచి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నారు. అక్టోబర్ 13న రాజమౌళి మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' ను రిలీజ్ చేస్తున్నారు. దీపావళికి రజినీకాంత్ డబ్బింగ్ సినిమా 'అన్నాత్తే' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సంక్రాంతి పండక్కి మహేష్ బాబు సర్కారు వారి పాట' - పవన్ కళ్యాణ్-రానా 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' - ప్రభాస్ 'రాధే శ్యామ్' - వెంకటేష్-వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' చిత్రాలు రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు మిగిలిన పెద్ద సినిమాల దృష్టి అంతా క్రిస్మస్ సీజన్ పై పడింది.

క్రిస్మస్ పండుగ కోసం అల్లు అర్జున్ ఆల్రెడీ కర్చీఫ్ వేసాడు. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'పుష్ప' పార్ట్-1 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ''పుష్ప: ది రైజ్'' పేరుతో మొదటి భాగాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందనన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ముత్యంశెట్టి మీడియా సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో 'పుష్ప' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పుడు 'పుష్ప' మూవీ వచ్చే సమయానికి ''కేజీయఫ్: చాప్టర్ 2'' చిత్రాన్ని బరిలో దింపాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని జులై 16న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి అడ్డుకుంది. ఇప్పుడు సినిమా విడుదలకు క్రిస్మస్ సీజన్ అనుకూలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. డిసెంబర్ 20న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'కేజీఎఫ్ 2' సినిమాపై భారీ అంచనాలు ఉన్నఉయ్. కన్నడ బహుబలిగా పిలవబడే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'కేజీఎఫ్ 1' మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘అధీరా’ అనే మెయిన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ - ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఒకవేళ డిసెంబర్ లోనే 'కేజీయఫ్ 2' వచ్చేది నిజమే అయితే బాక్సాఫీస్ వద్ద రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే అఖిల్ అక్కినేని - డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ''ఏజెంట్'' చిత్రాన్ని డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామని షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ప్రకటించారు. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర - సురేందర్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు 'పుష్ప 1' 'కేజీయఫ్ 2' లాంటి పెద్ద సినిమాల 'ఏజెంట్' చిత్రాన్ని విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందే హ్యాట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ' చిత్రాన్ని కూడా క్రిష్మస్ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. దసరా - సంక్రాంతి సీజన్స్ ఆల్రెడీ బ్లాక్ అయ్యాయి కాబట్టి.. ఇక మిగిలిన క్రిస్మస్ సీజన్ లోనే రావాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలానే బాలీవుడ్ మిస్టర్ హీరో అమీర్ ఖాన్ - నాగచైతన్య కలిసి నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని 2021 క్రిస్మస్ సమయంలోనే విడుదల చేయనున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య ని దృష్టిలో పెట్టుకొని తెలుగులోనూ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు డిసెంబర్ చివరి వారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తాయేమో చూడాలి.


Tags:    

Similar News