Agent: అయ్యో.. అనిల్ !

Update: 2023-05-01 08:00 GMT
సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం హీరో, డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తుంది. కలెక్షన్స్ మొత్తం హీరో వల్లే అంటారు. డైరెక్టర్ కి మరో మూవీ ఆఫర్ వస్తుంది. ప్రొడ్యూసర్ కి కాసుల వర్షం కురుస్తుంది. కానీ సినిమా ప్లాప్ అయితే హీరో, డైరెక్టర్ మీద నమ్మకం ఉంటే వారికి మళ్లీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రొడ్యూసర్ కోలుకోవడానికి మాత్రం చాలా కాలమే పడుతుంది. ప్రస్తుతం ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర పరిస్థితి అలానే ఉంది.

అఖిల్ స్టార్ డమ్ ని మించి మరీ ఏజెంట్ కోసం రూ.80కోట్లు ఖర్చుపెట్టాడు. సినిమా కోసం అఖిల్ కూడా బాగానే కష్టపడ్డాడు, డిఫరెంట్ జోనర్ కాబట్టి సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాడు. ఈ సినిమాకి ముందుగా 25కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ అది కాస్తా.. సినిమా పూర్తయ్యే సమయానికి రూ.80కోట్లు అయ్యింది.

సినిమా విడుదల ఆలస్యం కావడం కూడా బడ్జెట్ పెరగడానికి కారణమైంది.  సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఎవరూ సినిమా చూడటానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో నిర్మాతకు నష్టం మాత్రం తప్పలేదు.

నిజానికి అనిల్ సుంకరకు అమెరికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ డబ్బుతోనే ముందుగా డిస్ట్రిబ్యూష‌న్లోకి అడుగు పెట్టి, ఆ త‌ర్వాత 14 రీల్స్ అధినేత‌ల‌తో క‌లిసి సినిమాలు నిర్మించాడు. న‌మో వెంక‌టేశాయ‌, 1 నేనొక్క‌డినే, దూకుడు, ఆగ‌డు లాంటి భారీ చిత్రాల్లో ఆయ‌న భాగస్వామి. ఇలా ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. మ‌రోవైపు ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ అనే సొంత బేన‌ర్ పెట్టి చిన్న చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూ వ‌చ్చాడాయ‌న‌. త‌ర్వాత 14 రీల్స్ నుంచి విడిపోయి త‌న బేన‌ర్లోనే పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు.

కాగా, ప్రొడ్యూసర్ గా అనిల్ సుంకర కి గతంలోనూ నష్టాలు వచ్చాయి. కానీ ఏజెంట్ దెబ్బ మాత్రం చాలా ఎక్కువ అనే టాక్ వినపడుతుంది. ఏజెంట్ కచ్చితంగా హిట్ అవుతుందని అఖిల్ కంటే ఎక్కువగా నమ్మింది ఈయనే. అందుకే బడ్జెట్ పెరుగుతూ పోయినా, ఏ మాత్రం పట్టించుకోకుండా పెడుతూ వచ్చాడు. కానీ కథ రివర్స్ అయ్యింది. ఏజెంట్ దెబ్బ కొట్టింది. ఫలితం తక్కువ రేట్లకు టికెట్లు అమ్మినా కూడా జనాలు వచ్చి చూసేలా లేరు. మరి ఈ నష్టాన్ని నిర్మాత ఎలా తట్టుకుంటారో  చూడాలి.

Similar News