ఆకాశమే హద్దుగా సూర్య సినిమా.. ఇండియాలో నెం.1 - వరల్డ్ లో నెం.3

Update: 2021-05-14 04:53 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - లేడి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''సూరరై పొట్రు''. తెలుగులో ఈ సినిమా ''ఆకాశం నీ హ‌ద్దురా'' పేరుతో వచ్చింది. క‌రోనా పరిస్థితుల వల్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయ‌గా.. అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. తాజాగా ఈ చిత్రం షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పనారోమా సెక్షన్ 2021 కి గాను ఎంపికయింది. 'ప్రైయిజ్ ది బ్రేవ్' పేరుతో ఈ సినిమాను షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఎంపిక చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన రికార్డు సాధించింది.

అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ వచ్చిన 3వ సినిమాగా ''ఆకాశం నీ హ‌ద్దురా'' ఘనత సాధించింది. సినిమా వాళ్ళు కీలకంగా భావించే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB)లో ఈ సినిమాకి ఏకంగా 9.1 రేటింగ్ పాయింట్స్ దక్కడం విశేషం. 59,654 రేటింగ్స్ తో వరల్డ్ లో టాప్-3లో.. ఇండియాలో టాప్-1 ప్లేస్ లో నిలిచింది. ఐఎండీబీ రేటింగ్స్ లో 'ది షావ్‌శాంక్' మూవీ మొదటి స్థానంలో.. 'ది గాడ్ ఫాథర్' సినిమా రెండో స్థానంలో ఉన్నాయి.

'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమా ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. అలానే 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ కు పరిశీన‌కు కూడా వెళ్లింది. బెస్ట్ యాక్టర్ - బెస్ట్ యాక్ట్రెస్ - బెస్ట్ డైరెక్టర్ - బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌ విభాగాలలో ఫైనల్ నామినేష‌న్‌ లో చోటు ద‌క్కించుకోలేకపోయింది. కాగా, ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా.. ఒక సాధారణ పైలట్ విమానయాన సంస్థ ను ఎలా నెలకొల్పారనే అంశం మీద ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇందులో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా.. మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సిఖ్య ఎంట‌ర్‌టైన్మెంట్స్ - 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై సూర్య 'ఆకాశం నీ హద్దురా' సినిమాని నిర్మించారు.
Tags:    

Similar News