నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. త‌ప్పుడు ప్ర‌చారం త‌గదు!-శార‌ద‌

Update: 2021-08-08 12:30 GMT
ప్ర‌ముఖ వెట‌ర‌న్ న‌టి శార‌ద ఆరోగ్యంపై రెండు మూడు రోజులుగా ర‌క‌ర‌కాల‌ క‌థ‌నాలు వెలువ‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. శార‌ద అస్వ‌స్థ‌కు గుర‌య్యార‌ని.. నేడు ఆరోగ్యం మ‌రింత క్షీణించి విష‌మంగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రికొన్ని వెబ్ మీడియాలు ఏకంగా ఆమె క‌న్నుమూసార‌నే తప్పుడు  క‌థ‌నాలు వేసాయి. తాజాగా ఈ క‌థ‌నాల‌పై శార‌ద స్పందించారు.

వెబ్ మీడియాలో  త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల్ని ఖండించారు. త‌ను చాలా ఆరోగ్యంగా ఉన్నార‌ని త‌ప్పుడు వార్త‌లు రాయోద్ద‌ని హిత‌వు ప‌లికారు. త‌న‌పై వ‌చ్చిన పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని అభిమానుల్ని..ప్రేక్ష‌కుల్ని కోరారు. చెన్నైలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నానని  తెలిపారు.

ఇలాంటి అవాస్త‌వాలు  రాసే ముందు ఆలోచించుకుని రాయాల‌ని.. ఏదైనా విష‌యం ఉంటే నేరుగా త‌న‌ని సంప్ర‌దించ‌వ‌చ్చని పేర్కొన్నారు. దీంతో అవ‌న్నీ ఫేక్ వార్త‌ల‌ని తేలిపోయింది. శార‌ద వ‌య‌సు 76 ఏళ్లు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. ప‌లు భాష‌ల్లో  న‌టిగా అవ‌కాశాలు వ‌చ్చిన న‌ట‌న‌కు స్వ‌స్తి ప‌లికిన‌ట్లు చాలా సంద‌ర్భాల్లో ఆమె తెలిపారు. శారద తన కెరీర్ లో దాదాపు 500 సినిమాల్లో  వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. మూడు జాతీయ అవార్డులను  అందుకున్నారు.

డిజిట‌ల్ యుగంలో ఫేక్ వార్త‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియా  అందుబాటులోకి వ‌చ్చాక ఎంతో మంది బ్ర‌తికి ఉన్న న‌టుల్ని కూడా సోష‌ల్ మీడియా చంపేసింది. గ‌తంలో చాలా మంది న‌టీన‌టుల‌పై ఇలాంటి  త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. వాటిపై బాధితులు అంతే ధీట గా స్పందించి నోళ్లు మూయించారు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి కూడా స్ప‌ష్ట‌త లోపం కార‌ణంగాను ప‌లు మార్లు త‌ప్పుడు క‌థ‌నాలు  వెలువ‌డిన  సంద‌ర్భాలున్నాయి. న‌టీనటుల మేనేజ‌ర్లు..స‌న్నిహితులు స‌మాచారం అందించండం వైఫ‌ల్యం కార‌ణంగా ఇలాంటి పొర‌పాట్లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.
Tags:    

Similar News