సూపర్‌స్టార్ మూవీ... 37 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి, ఇప్పుడు రిలీజ్?
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది వందలాది సినిమాలు ప్రారంభం అవుతాయి. అయితే ప్రారంభం అయిన ప్రతి సినిమా వెండితెర వరకు వస్తుంది అనే నమ్మకం లేదు.;
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది వందలాది సినిమాలు ప్రారంభం అవుతాయి. అయితే ప్రారంభం అయిన ప్రతి సినిమా వెండితెర వరకు వస్తుంది అనే నమ్మకం లేదు. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఆగిపోతే, కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఆగి పోతాయి, కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆగి పోయాయి. కొన్ని ఏకంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆగి పోవడం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఆగి పోవడంకు చాలానే కారణాలు ఉంటాయి. స్క్రిప్ట్ సెట్ కాకపోవడంతో కొన్ని సినిమాలు ఆగి పోతే, కొన్ని సినిమాలు షూటింగ్ దశలో విభేదాల కారణంగా ఆగి పోతాయి, షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఇది వర్కౌట్ కాకపోవచ్చ అని వదిలి పెట్టిన సినిమాలు కొన్ని ఉంటాయి. కొన్ని సినిమాలు చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ల్యాబ్ కే పరిమితం అయినవి ఉంటాయి. కానీ ఒక సినిమా ఒక నెల లేదా రెండు నెలలు లేదా రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఆలస్యం కావడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ రజనీకాంత్ మూవీ 37 ఏళ్ల ఆలస్యంగా రాబోతుంది.
హమ్ మే షా హెన్ షా కౌన్ సినిమా రిలీజ్...
1989లో రజనీకాంత్, శత్రఘ్న సిన్హా హీరోలుగా హేమా మాలిని ముఖ్య పాత్రలో రూపొందిన హిందీ చిత్రం 'హమ్ మే షా హెన్ షా కౌన్'. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారని, విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మేకర్స్ నుంచి అప్పట్లో ప్రకటన వచ్చింది. ఇద్దరు పెద్ద స్టార్స్ కాంబో మూవీ కావడంతో తమిళ్ లో డబ్బ్ చేసేందుకు సైతం నిర్మాతలు ఆసక్తి చూపించారు. కానీ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ను మళ్లీ తీసుకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం అవుతూ వచ్చాయి. నిర్మాత, దర్శకుడు చనిపోవడం, ఇంకా ఇతర వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్ల సినిమాను నిర్మాణ సంస్థ ముందుకు తీసుకు వెళ్లలేక పోయింది. దాంతో ఇన్నాళ్లు సినిమా విడుదల అవుతుంది అనే నమ్మకం ఏ ఒక్కరిలోనూ లేదు.
ఏఐ టెక్నాలజీతో రాబోతున్న సూపర్ స్టార్ మూవీ
సినిమా గురించి దాదాపు అందరూ మరిచి పోయారు. ఆ సినిమాకు వర్క్ చేసిన వారిలో చాలా మంది చనిపోయారు. మిగిలిన వారు సైతం అదంటూ ఒక సినిమా ఉందా అనే విషయాన్ని కూడా మర్చి పోయారు. మొత్తానికి సినిమా గురించి మొత్తానికి మొత్తం అంతా మరిచి పోతున్న సమయంలో అనూహ్యంగా సినిమా విడుదల ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. పైగా సినిమాకు ఏఐ టెక్నాలజీని అద్ది మరీ విడుదల చేయడం కోసం నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే రీల్ లో ఉన్న సినిమా ను డిజిటల్ ఫార్మట్ లోకి కన్వర్షన్ జరిగిందని, సౌండ్ ఇతర విషయాల పట్ల మరింత శ్రద్ద తీసుకుంటూ, హీరోల ఇద్దరిని కూడా చాలా స్పెషల్ కేర్ తో చూపించే విధంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రజనీకాంత్, శత్రఘ్నసిన్హా హీరోలుగా..
గతంలో ఈ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించిన షబానా, అస్లాం మీర్జా లు ముందుకు వచ్చి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. గతంతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేసి సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు రజనీకాంత్, శత్రఘ్న సిన్హా, హేమా మాలిని నుంచి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా, మ్యూజిక్ విషయంలోనూ ఎలాంటి కాపీ రైట్ లేకుండా లీగల్ చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల అయితే కచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం ఖాయం. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఏఐ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే తప్పకుండా ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడం ఖాయం అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 37 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఇప్పటికి అయినా వచ్చేనా? మళ్లీ ఏదైనా అడ్డంకి తగిలేనా అనేది చూడాలి. నిర్మాతలు మాత్రం 2026 ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నమ్మకంగా చెబుతున్నారు.