దేశ స‌రిహ‌ద్దులో 'పెద్ది' సంగీత ద‌ర్శ‌కుడు ఏం చేస్తున్నాడో చూడండి

స్వ‌ర‌మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కేవలం వెండితెర కోసం ప‌ని చేయ‌డ‌మే కాదు.. నిజజీవితంలోనూ తన స్వరాలతో దేశభక్తిని చాటుకున్నారు.

Update: 2026-06-07 18:39 GMT

స్వ‌ర‌మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కేవలం వెండితెర కోసం ప‌ని చేయ‌డ‌మే కాదు.. నిజజీవితంలోనూ తన స్వరాలతో దేశభక్తిని చాటుకున్నారు. ఇటీవల భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ-వాఘా బోర్డర్ లో ఆయ‌న బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు నివాళి ఇచ్చారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లను కలిసి వారి సమక్షంలో అద్భుతమైన లైవ్ ప్రదర్శన ఇచ్చారు. దేశ రక్షణ కోసం రేయింబవ‌ళ్లు శ్రమిస్తున్న జవాన్ల త్యాగాలను కొనియాడుతూ రెహమాన్ చేసిన ఈ పర్యటన ప్రస్తుతం సోషల్ మీడియాలో - సినీ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది.

రెహమాన్ ఈ ప్రత్యేక పర్యటన చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆయన త‌న త‌దుప‌రి మ్యూజికల్ ప్రాజెక్ట్ `మై వాపస్ ఊంగా` విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని ప్రధాన గీతాన్ని జవాన్లకు అంకితమిస్తూ బోర్డర్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. సరిహద్దులో దేశభక్తి ఉట్టిపడే వాతావరణం మధ్య తన స్వరాలతో ఆయన అక్కడి జవాన్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎప్పుడూ తుపాకుల మోత, కఠినమైన పహారాతో ఉండే సరిహద్దు ప్రాంతం.. రెహమాన్ సంగీత ప్రవాహంతో కాసేపు పులకించిపోయింది. జవాన్లు కూడా ఆయనతో కలిసి ఉత్సాహంగా పాటలు పాడుతూ హర్షధ్వానాలు చేశారు.

సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌కు దేశభక్తి చిత్రాలతో గీతాలతో ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. రోజా, `బొంబాయి` చిత్రాల నుండి మొదలుకొని `వందేమాతరం` (మా తుఝే సలామ్) ఆల్బమ్ వరకు అతడు సృష్టించిన దేశభక్తి స్వరాలు ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు మరోసారి `మై వాపస్ ఊంగా` చిత్రం ద్వారా దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించే సైనికుల జీవితాన్ని వారి త్యాగాలను సంగీతం రూపంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్బమ్ ప్రమోషన్లను నేరుగా జవాన్ల సమక్షంలోనే ప్రారంభించడం ద్వారా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.

ప్రస్తుతం రెహమాన్ సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ చిత్రమైన `పెద్ది` కి సంగీతం అందించారు. పాట‌లు మాస్ లో మ్యాసివ్ హిట్స్ గా నిలిచాయి. రెహమాన్ ఈ చిత్రానికి అందించిన‌ ట్యూన్లు - బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు `పెద్ది` వంటి భారీ కమర్షియల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు దేశభక్తి ప్రాజెక్టుల కోసం బోర్డర్ వరకు వెళ్లి ప్రదర్శన ఇవ్వడం రెహమాన్ వృత్తిపరమైన నిబద్ధతకు అద్దం పడుతోంది.

ఒక స్టార్ కంపోజర్ కేవలం విలాసవంతమైన స్టూడియోలకే పరిమితం కాకుండా.. దేశాన్ని రక్షించే సైనికుల చెంతకు వెళ్లి వారిని గౌరవించడం చిత్ర పరిశ్రమలో ఒక మంచి పరిణామం. రెహమాన్ అట్టారీ బోర్డర్‌లో చేసిన ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న సైనికుల పట్ల గౌరవాన్ని మరింత పెంపొందించడానికి దోహదపడుతుంది.

Tags:    

Similar News