రెహమాన్ కెరీర్ లోనే తొలిసారి ఆ మాట!
ముఖ్యంగా ఈ సినిమాకు అందుతున్న సంగీత బలం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమర్శకులను సైతం ఆకర్షిస్తోంది.
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `రామాయణం`రోజురోజుకూ పరిధిని విస్తరించుకుంటూ గ్లోబల్ ప్రాజెక్ట్‌గా మారుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాస్టింగ్ పరంగానే కాకుండా సాంకేతిక విభాగంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు అందుతున్న సంగీత బలం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమర్శకులను సైతం ఆకర్షిస్తోంది. భారతీయ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా, ఆయనతో పాటు హాలీవుడ్ దిగ్గజం జాయిన్ అవ్వడం విశేషం.
అద్భుతమైన స్వరాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నఏఆర్ రెహమాన్ కెరీర్‌లో ఇదొక అరుదైన సందర్భం అని చెప్పాలి. సాధారణంగా రెహమాన్ పని పట్ల తోటి కళాకారుల పట్ల ఎంతో వినమ్రంగా ఉంటారు. అయితే ఆయన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నడు లేని విధంగా ఓ తోటి మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం పట్ల అత్యంత గౌరవాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్‌లో `ఇంటర్ స్టెల్లార్`, `ఇన్సెప్షన్`, `ది లయన్ కింగ్` వంటి చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ హన్స్ జిమ్మర్‌తో కలిసి రెహమాన్ `రామాయణం` కోసం పని చేస్తున్నారు.
ఇద్దరు ప్రపంచ స్థాయి సంగీత దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే మైలురాయి. తూర్పు దేశాల ఆత్మను ప్రతిబింబించే మెలోడీలను, పశ్చిమ దేశాల గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్‌ను మిక్స్ చేస్తూ ఇద్దరు చిత్రానికి సరికొత్త మ్యూజికల్ వండర్‌ను సృష్టిస్తున్నారు. ఈ కొల్లాబరేషన్‌పై రెహమాన్ ఆసక్తికరంగా స్పందించారు. హన్స్ జిమ్మర్ లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆయన పనితీరు నుండి ఎంతో నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు.
హాలీవుడ్ లెజెండ్ పట్ల రెహమాన్ చూపించిన వినమ్రత, ఆయన వ్యక్తిత్వాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. కెరీర్‌లో ఎందరో అంతర్జాతీయ కళాకారులతో పని చేసినా? హన్స్ జిమ్మర్‌తో కలిసి పంచుకుంటున్న జర్నీ అత్యంత ప్రత్యేకమైనదని రెహమాన్ మనస్ఫూర్తిగా అంగీకరించారు. దర్శకుడు నితీష్ తివారీ `రామాయణం` కథను ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా విజువల్‌గా -ఆడియో పరంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసమే అంతర్జాతీయ మ్యూజికల్ కాంబినేషన్‌ను సెట్ చేశారు. శ్రీరాముడి కథలోని పౌరాణిక గాంభీర్యాన్ని, భావోద్వేగాలను హన్స్ జిమ్మర్ సింఫొనీ స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రెహమాన్ మార్క్ డివైన్ ట్యూన్స్ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తాయనేది ఆసక్తికరం.
ఏఆర్ రెహమాన్ నోట వచ్చిన అరుదైన ప్రశంసలు `రామాయణం` సినిమా సంగీతంపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్‌లోకి దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సంగీత సమ్మేళనం కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇద్దరు లెజెండ్స్ కలిసి అందిస్తున్న ఆడియో విజువల్ ట్రీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.