సంగీత దర్శకుడు అనిరుధ్- కావ్య కళానిధి వివాహం: ప్రధాని మోదీ- సీఎం విజ‌య్-రేవంత్ అతిథులు!

తాజాగా అనిరుధ్ కుటుంబ సభ్యులు శుభ‌లేఖ‌లు పంచిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి.

Update: 2026-10-17 10:38 GMT

కోలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇటీవల అత‌డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా.. అత‌డి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక పెద్ద వార్త ప్రస్తుతం ఇటు సినిమా, అటు వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్య కళానిధి - అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నట్లు వెలువడిన వార్తలు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. కొన్ని నెల‌లుగా సౌత్ ఇండియన్ మీడియా దిగ్గజ కుటుంబం - ప్రముఖ సంగీత దర్శకుడి మధ్య కుదురుతున్న ఈ వివాహబంధం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు, పోస్టులు వైరల్ అయ్యాయి. రెండేళ్లుగా వీరిద్దరి గురించిన ఊహాగానాలతో ట్రెండింగ్ పోస్టులు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

2026లో అనిరుధ్ మామయ్య వై. జి. మహేంద్రన్ వారి వివాహం `ఖచ్చితంగా జరగబోతోంది` అని పేర్కొన్నట్లు వార్తలు రావడంతో పుకార్లు ఎక్కువ‌య్యాయి. తాజాగా అనిరుధ్ కుటుంబ సభ్యులు శుభ‌లేఖ‌లు పంచిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. కుటుంబ స‌భ్యుల‌ వివ‌రాల ప్ర‌కారం.. అనిరుధ్- కావ్య జంట‌ 2026 నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం చేసుకోబోతున్నారని.. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారని స్పష్ఠ‌త వ‌చ్చింది.

ఈ నేపథ్యంలో ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పర్వం కొన‌సాగుతోంది. తాజాగా సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీని, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌ను, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు. కావ్య కళానిధి, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్ర‌ముఖుల‌కు అందజేశారు. ప్ర‌ధానికి శుభ‌లేఖ అంద‌జేసే సమావేశంలో అనిరుధ్ రవిచందర్‌తో పాటు అత‌డి తల్లిదండ్రులు లక్ష్మి, రవిచందర్ కూడా ఉన్నారు.

ఈ హై-ప్రొఫైల్ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల ప్రవాహం మొదలైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ జంటకు ముందస్తు అభినందనలు తెలుపుతున్నారు. ఒకవైపు అనిరుధ్ సంగీత కెరీర్ విజయవంతంగా దూసుకుపోతుండగా.. మరోవైపు దేశంలోని అత్యున్నత ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మొత్తానికి దక్షిణ భారతదేశపు ప్రముఖ మీడియా దిగ్గజం మారన్ కుటుంబం -ప్రముఖ సంగీత కుటుంబం ఒక్కటి కాబోతుండటం ప్రస్తుత సినీ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీని కలిసి వివాహ ఆహ్వానం అందించడంతో ఈ వేడుక మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అనిరుధ్, కావ్యల వివాహం త్వరలోనే అత్యంత వైభవంగా జరగనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News