గ్లోబల్ మ్యూజిక్ రంగాన్ని శాసించేలా స్టార్ హీరో వ్యూహం!
ఈ అంతర్జాతీయ వెంచర్ వెనుక ఉన్న అసలు కారణాన్ని షారుఖ్ మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ రంగాన భారతీయ కళా రూపాన్ని.. సినిమా వైభవాన్ని సగర్వంగా ప్రదర్శించడంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎప్పుడూ ముందే ఉంటారు. కేవలం నటుడిగానే కాకుండా విజన్ ఉన్న ఒక ప్రొడ్యూసర్‌గా, పారిశ్రామికవేత్తగా ముద్ర వేసిన షారుఖ్ ఇప్పుడు అంతర్జాతీయ మ్యూజిక్ పరిశ్రమలో సరికొత్త విప్లవానికి తెరతీశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా అబుదాబిలోని ప్రతిష్టాత్మక `ఎతిహాద్ లైవ్` వేదికపై `యునిఫైడ్ ఫెస్టివల్` పేరుతో బ్రహ్మాండమైన మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రకటించడం గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి దారితీసింది. 2027 మార్చి 20న జరగనున్న ఈ ఫెస్టివల్ వెనుక షారుఖ్ ఖాన్ ఆలోచన కేవలం ఒక ఈవెంట్ నిర్వహించడం మాత్రమే కాదు. దానికి మించిన సుదూర వ్యూహాత్మక ఉద్దేశాలు కనిపిస్తున్నాయి.
షారుక్ ఆలోచనకు ప్రధాన బలం భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత నైపుణ్యమే కారణం. అర్జిత్ సింగ్ మెలోడీ, సోనూ నిగమ్ స్వరాభినయం, కరణ్ ఔజ్లా పంజాబీ రాప్ ట్రెండ్లు ఒకే వేదికపైకి రావడం అన్నది ఈవెంట్ ప్రాథమిక ఆకర్షణ. ప్రతిభావంతులైన ముగ్గురు దిగ్గజాలను మొదటి విడతలోనే లైనప్‌లోకి తెచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో షారుఖ్ విజయం సాధించారు. విభిన్న సంగీత శైలులు, విభిన్న తరాల ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కళాకారుల ద్వారా దక్షిణాసియా సంగీతానికి ఉన్న అసలైన బలాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటడమే ఈ మ్యూజిక్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
ఈ అంతర్జాతీయ వెంచర్ వెనుక ఉన్న అసలు కారణాన్ని షారుఖ్ మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలంగా వెండితెరపై కథలు చెప్తూ ప్రజల భావోద్వేగాలను ఏకం చేసిన అనుభవం ఆయనది. అయితే భాషతో సంబంధం లేకుండా మనుషులను నేరుగా కనెక్ట్ చేయగల అద్భుతమైన శక్తి సంగీతానికి మాత్రమే ఉందని షారుక్ బలంగా నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న దక్షిణాసియా (సౌత్ ఏషియన్) డయాస్పోరాను.. ఇతర అంతర్జాతీయ ప్రేక్షకులను ఒకే వేదిక కిందికి తీసుకురావడం ద్వారా భారతీయ సంగీత విపణి స్థాయిని అంతర్జాతీయ పాప్ ఉత్సవాలైన `కోచెల్లా`..`టుమారోల్యాండ్` స్థాయికి తీసుకెళ్లడమే షారుఖ్ ఆశయం.
ముఖ్యంగా యుఏఈ అనేది గ్లోబల్ రవాణాకు, వినోద రంగానికి , అంతర్జాతీయ పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లుతోంది. అక్కడ ప్రతి దేశానికి చెందిన పౌరులు నివసిస్తున్నారు. అలాంటి వ్యూహాత్మక ప్రదేశంలో దక్షిణాసియా మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేయడం ద్వారా ఇది ఆసియా వాసులకు మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రజలకు కూడా మన కళల పట్ల ఆసక్తిని పెంచుతుంది. రాబోయే రోజుల్లో 15 మందికి పైగా దిగ్గజ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనడం గ్లోబల్ రీచ్‌ను మరింత పెంచనుంది.
వ్యాపార కోణంలో చూసినా? ఇది ఇండియన్ మ్యూజిక్ అండ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ రంగానికి నూతన అధ్యాయం. ప్రస్తుతం గ్లోబల్ లైవ్ ఈవెంట్స్ మార్కెట్ ఆకాశాన్ని తాకుతున్న వేళ ఇండియన్ మ్యూజిక్ పొటెన్షియల్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవడంలో బాలీవుడ్ ఇప్పటి వరకు కొంత వెనుకబడింది. ఆ లోటును భర్తీ చేస్తూ షారుఖ్ స్వయంగా క్యూరేటర్‌గా వ్యవహరిస్తూ లైవ్ కన్సర్ట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం ద్వారా గ్లోబల్ బ్రాండ్లు, స్పాన్సర్‌షిప్‌లు ప్రపంచవ్యాప్త టికెటింగ్ ద్వారా సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించే దిశగా షారుక్ అడుగులు వేస్తున్నారు.
మొత్తానికి `యునిఫైడ్ ఫెస్టివల్` అనేది కేవలం ఒక రోజు జరిగే సంగీత విభావరి కాదు. అది భారతీయ సాంస్కృతిక ముద్రను గ్లోబల్ మ్యాప్‌పై మరింత బలంగా వేసేందుకు షారుఖ్ ఖాన్ వేసిన సమర్థవంతమైన ఎత్తుగడ. సాంకే తికత, అద్భుతమైన మ్యూజిక్ లైనప్, గ్రాండ్ స్కేల్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రాబోతున్న ఈవెంట్ రాబోయే రోజుల్లో భారతీయ సంగీత పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని ఎలా మార్చబోతోందో చాటిచెప్పే దిక్సూచిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.