వరుస ఫ్లాప్స్ తర్వాత కృతిశెట్టికి గోల్డెన్ ఛాన్స్?
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలపై బాగా దృష్టి పెరుగుతున్న తరుణంలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు.;
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలపై బాగా దృష్టి పెరుగుతున్న తరుణంలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లను ఒకే తెరపైకి తీసుకురాబోతుండటం విశేషం. ఎంటర్టైన్మెంట్ కథలతో వరుస సక్సెస్‌లు అందుకున్న అనిల్ రావిపూడి ఈ కాంబినేషన్‌ను ఎలా మలచబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోంది. కథలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని, ఫ్యామిలీ, కామెడీ, ఎమోషన్స్ మేళవించిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. వెంకటేష్‌కు అనిల్ రావిపూడితో ఇప్పటికే ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.
కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి
ఇక ఈ సినిమా హీరోయిన్ల విషయంలో కూడా ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి. మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉండగా, మరో కథానాయికగా కృతి శెట్టి ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి హిట్లలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.
కోలీవుడ్ వైపు అడుగేసిన కృతి
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆమె కెరీర్ కొంత మందగించింది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసిన కృతి, అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే కొన్ని తమిళ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉండగా, ఇప్పుడు ఈ మల్టీస్టారర్ చేస్తే ఇది కృతికి టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ ప్రాజెక్టు అయ్యే అవకాశముంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇప్పటివరకు ఫ్లాపులు లేవు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ కృతికి కంబ్యాక్ అవకాశాన్ని అందించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ లో సెట్స్ పైకి
కాగా ఈ సినిమాను జూన్ నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా అనిల్ ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరికల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించాలనే లక్ష్యంతో యూనిట్ ముందుకు సాగుతోంది. 2027 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ మల్టీస్టారర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.