'సినిమా ఒక కథ మాత్రమే.. మనదే బాధ్యత'.. అనసూయ పోస్ట్ వెనుక కారణమేంటి?
టాలీవుడ్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ అనసూయ ఎప్పటికప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
టాలీవుడ్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ అనసూయ ఎప్పటికప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినిమాలు, సొసైటీ, బాధ్యతల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. "పూర్తిగా చదవండి.. లేకపోతే మళ్లీ తప్పుగా అర్థం చేసుకుంటారు" అంటూ లాంగ్ పోస్ట్ ను షేర్ చేశారు.
సినిమాలను మాత్రమే తప్పుబట్టడం సరైనది కాదని అనసూయ అన్నారు. సినిమా అనేది ఒక కథ మాత్రమేనని, అది సమాజానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏది మంచి, ఏది చెడు అన్నది గుర్తించే బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉంటుందని పేర్కొన్న అనసూయ.. పిల్లలను పెంచే బాధ్యత సినిమాలది కాదని ఆమె స్పష్టం చేశారు. ఆ పని తల్లిదండ్రులదేనని అన్నారు. అయితే దీనివల్ల సినిమా వాళ్ల బాధ్యత పూర్తిగా పోయిందని కూడా అనుకోవద్దట.
సినిమాలు ప్రజలపై కొంత ఎఫెక్ట్ చూపిస్తాయని, ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. గతంలో హీరో పాత్రలను చూసి మంచి విషయాలు నేర్చుకునేవారని, విలన్ రోల్స్ ను చెడుగా భావించేవారని అనసూయ చెప్పారు. కానీ ఇప్పుడు కథలు, పాత్రలు చాలా భిన్నంగా ఉంటున్నాయని అన్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో మంచి-చెడు మధ్య తేడా క్లియర్ గా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు అనసూయ.
ఇలాంటి విషయాలపై తాను మాట్లాడినప్పుడు కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారని ఆమె చెప్పారు. తాను సినిమాలపై రూల్స్ పెట్టాలని కోరుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. కథ చెప్పే ప్రతి ఒక్కరూ తమ పని సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని మాత్రమే చెబుతున్నానన్నారు. రైటర్స్, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా బాధ్యత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా చూసే వారు కూడా ఆలోచించి స్పందించాలని అన్నారు.
తన అభిప్రాయాల కారణంగా గతంలో ఒక షో నుంచి బయటకు వచ్చానని అనసూయ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురైనా, తాను నమ్మిన విషయాల కోసం నిలబడ్డానని చెప్పిన ఆమె.. ఇకపై కూడా తన అభిప్రాయాలను చెప్పడంలో వెనక్కి తగ్గని స్పష్టం చేశారు. క్రియేటివ్ ఫ్రీడం చాలా ముఖ్యమని, అదే సమయంలో బాధ్యత కూడా అవసరమని అనసూయ అన్నారు. ఈ రెండూ కలిసి ఉండగలవని చెప్పారు. సినిమాలు సమాజంలోని ప్రతి సమస్యకు కారణం కాకపోయినా, వాటి ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేమని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది ఇలాంటి అంశాలపై మాట్లాడుతున్నారని, అది మంచి విషయమేనని అనసూయ అన్నారు. తప్పులు కనిపిస్తే ప్రశ్నించడం, చర్చించడం అవసరమని చెప్పారు. చివరగా కంటెంట్ క్రియేట్ చేసేవారు, నటీనటులు, నిర్మాతలు, ఇన్ ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకులు అందరూ మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో అందరికీ పాత్ర ఉందని, అందుకే సినిమాలను మాత్రమే నిందించడం కంటే మన బాధ్యతలను కూడా గుర్తించుకోవాలని అనసూయ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో అనసూయ పోస్ట్ పెట్టడం వెనుక కారణం ఏంటనేది అంతా మాట్లాడుకుంటున్నారు.