హీరోగా కాదు.. నటుడిగా ఆనంద్ దేవరకొండ కొత్త గేమ్ ప్లాన్ ఇదే!

రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది.

Update: 2026-08-18 05:29 GMT

ఆనంద్ దేవరకొండ కెరీర్‌ను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తనకు వచ్చిన స‌క్సెస్ ను అదే ఫార్ములాతో కంటిన్యూ చేయ‌డానికి ట్రై చేయ‌డం కంటే, ప్రతిసారీ కొత్త తరహా కథలు, భిన్నమైన పాత్రల వైపు అడుగులు వేయడానికే ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు అతని చేతిలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తే.. హీరోగా మార్కెట్ పెంచుకోవడం కంటే నటుడిగా తన పరిధిని విస్తరించుకోవాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తోంది.

రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా యూత్ లో అతనికి స్పెష‌ల్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన గం గం గణేశా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గం గం గ‌ణేశా త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆనంద్.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి అతను ఎంచుకున్న కథలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండటం ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం అతని లైనప్‌లో ఉన్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఒక వైపు యూత్‌ఫుల్ ఎమోషన్స్, లవ్ స్టోరీ అంశాలతో రూపొందుతోంది. మరోవైపు తక్షకుడు పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లే ఫోక్‌లోర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో ఆనంద్ పోషిస్తున్న పాత్ర కూడా అతని గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనుంది. గిరిజన యువకుడైన‌ గుడ్డివాడి పాత్ర‌లో ఆనంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడనే సమాచారం ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఇక్కడే ఆనంద్ క‌థల‌ ఎంపికల్లో కనిపిస్తున్న మరో ఆసక్తికరమైన అంశం బయటపడుతోంది. ఒకే జానర్‌కు పరిమితం కాకుండా విభిన్న కథలను ఎంచుకోవడం ద్వారా తన యాక్టింగ్ స్కిల్స్ ను పరీక్షించుకుంటున్నాడు. కమర్షియల్ హీరోగా ఒకే ఇమేజ్‌ను బలపరచుకోవడం కంటే, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో తన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో థియేట్రికల్, ఓటీటీ అనే రెండు విభిన్న రిలీజ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆనంద్ లైనప్‌లో చూడొచ్చు. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తక్షకుడు నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంటే సినిమా కథకు, దాని స్వభావానికి తగ్గట్టుగా రిలీజ్ మోడల్‌ను ఎంచుకునే కొత్త ట్రెండ్‌లో ఆనంద్ కూడా భాగమవుతున్నాడు.

థియేటర్‌లో కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే.. ఓటీటీ ద్వారా ప్రయోగాత్మక పాత్రలను ఆడియ‌న్స్ కు పరిచయం చేయడం అతని కెరీర్‌కు కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. మరి ఈ విభిన్న ప్రయోగాలు ఆనంద్‌ను నెక్ట్స్ లెవెల్ యాక్ట‌ర్ గా నిలబెడతాయా? లేక మళ్లీ బేబీ రేంజ్ స‌క్సెస్ ను అందుకోవడమే అతని నెక్ట్స్ టార్గెటా అనేది రాబోయే సినిమాల ఫలితాలతోనే తేలనుంది.

Tags:    

Similar News