ఖాళీ చేతులతో వచ్చాం.. ఖాళీ చేతులతోనే వెళ్తాం!
ఎనిమిది పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా విశ్రాంతి అన్నదే లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.;
ఎనిమిది పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా విశ్రాంతి అన్నదే లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. తాజాగా తన జీవిత దృక్పథాన్ని అత్యంత భావోద్వేగంగా పంచు కున్నారు. తన బ్లాగ్ వేదికగా ఆయన చేసిన ఆత్మపరిశీలన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పూర్తి రోజంతా ఆయన కేవలం తన ఉనికిని, ఈ ప్రపంచం నడిచే తీరును విశ్లేషించుకోవడానికే కేటాయించానని పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని శిఖరాలు అధిరోహించినా? చివరికి మనం మిగిల్చేది మన ఆలోచనలే తప్ప భౌతిక సంపద కాదని పేర్కొన్నారు.
అమితాబ్ తన బ్లాగ్‌లో రాస్తూ `ఒక నిశ్శబ్దమైన రోజును నా గురించి నేను ఆలోచించుకోవడానికి కేటాయించాను. నాలో నేనే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాను. సమాధానాల కోసం వెతికాను. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే? మరికొన్ని అస్పష్టంగానే ఉండిపోయాయి` అని రాసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఒక వ్యక్తి ఇలాంటి తాత్విక చింతనలో మునిగిపోవడం ఆయనలోని వినయానికి , పరిణతికి నిదర్శనంగా చెప్పొచ్చు. జీవితం యొక్క అంతిమ సత్యాన్ని బిగ్ బి చాలా సరళంగా అదే సమయంలో గంభీరంగా వివరించారు.
`ఎందరో మహానుభావులు ఎందుకు? ఎలా? అని వెతకడంలోనే జీవితాలను గడిపేశారు. కానీ అంతిమంగా మనకు తెలిసేది ఒక్కటే.. ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం. వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాం` అని రాసుకొచ్చారు. భౌతికవాద ప్రపంచంలో పరుగులు తీస్తున్న నేటి తరానికి ఆయన మాటలు ఒక గొప్ప హెచ్చరికగా , పాఠంగా నిలుస్తున్నాయి. అమితాబ్ లో ఇలాంటి వేదాంత ధోరణి ఉన్నప్పటికీ పని పట్ల ఆయనకున్న మక్కువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ షూటింగ్‌లో పాల్గొనకపోతే లేదా పనిలో నిమగ్నం కాకపోతే ఏదో తెలియని అశాంతిగా ఉంటుందని గతంలోనే తెలిపారు.
ప్రస్తుతం `కల్కి 2` వంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఒకవైపు నటనలో అత్యున్నత శిఖరాలను తాకుతూనే? మరోవైపు జీవితం పట్ల ఇంతటి సాదాసీదా దృక్పథాన్ని కలిగి ఉండటం అమితాబ్ ప్రత్యేకత. దీంతో అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ గొప్ప ఫిలాసఫర్ అని అర్థమవుతోంది. అనుభవమే ఆయన్ని ఇలా మాట్లాడిస్తోంది. పేరు, ప్రఖ్యాతులు, సంపద శాశ్వతం కాదని.. చేసే పని , వ్యక్తిత్వం మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయని ఆయన మాటలు గుర్తు చేస్తున్నాయి. ఎనభై ఏళ్ల అనుభవం రంగరించి ఆయన చెప్పిన జీవిత సత్యాన్ని మరో కోణంలో చూడటానికి ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తోంది.