'అమీర్ లోగ్'పై వంశీ నందిపాటి రివ్యూ.. సినిమా క్లిక్కయ్యేలా ఉందే..

చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావాలంటే కంటెంట్‌ లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి.

Update: 2026-07-06 06:49 GMT

చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావాలంటే కంటెంట్‌ లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. స్టోరీ, బ్యాక్ డ్రాప్, రోల్స్ కనెక్ట్ అయితే భారీ క్యాస్టింగ్ లేకపోయినా సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న చిత్రం అమీర్ లోగ్. పక్కా హైదరాబాదీ నేటివిటీతో రూపొందిన ఆ సినిమాపై నిర్మాత వంశీ నందిపాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌ లో జరిగిన ‘అమీర్ లోగ్ టీజర్‌ రిలీజ్ ఈవెంట్ లో వంశీ నందిపాటి పాల్గొన్నారు. ఇప్పటికే తాను పూర్తి సినిమా చూశానని చెప్పిన ఆయన.. పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ముఖ్యంగా కథ, పాత్రలు, హైదరాబాదీ కల్చర్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని చెప్పారు. అమీర్ లోగ్ అంటే డబ్బున్నవాళ్ల కథ అని చాలామంది అనుకోవచ్చని.. కానీ సినిమా అంతకుమించి ఉంటుందని తెలిపారు.

ఎమోషన్స్, వాల్యూస్, ఫ్రెండ్‌షిప్‌తో పాటు ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను సినిమాలో చూపించారని చెప్పారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత ఆలోచనలు, వారి ప్రయాణం వంటి అంశాలను తీసుకుని తెరకెక్కించారని పేర్కొన్నారు. సినిమాను తాను పూర్తిగా ఎంజాయ్ చేశానని చెప్పిన వంశీ.. ఫస్టాఫ్ చూసిన తర్వాత అసలు దీన్ని చిన్న సినిమా అని ఎందుకు అనుకోవాలనే భావన కలిగిందన్నారు. ఇది మంచి వైబింగ్ ఫిల్మ్ అని ప్రశంసించారు.

ఇటీవలి కాలంలో పక్కా హైదరాబాదీ కల్చర్‌ ను రిఫ్లెక్ట్ చేసేలా సినిమాలు పెద్దగా రాలేదని.. గతంలో కొన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించాయని గుర్తుచేశారు. ‘అమీర్ లోగ్ కూడా అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దర్శకుడు రమణ పనితీరును ప్రశంసించారు. సినిమాలోని నటీనటులు పాత్రల్లో సహజంగా కనిపించారని చెప్పారు. తెరపై నటులను చూస్తుంటే నిజమైన హైదరాబాద్ యువకులను చూసినట్లే అనిపించిందన్నారు.

అల్లరి చిల్లరగా తిరిగే కొంతమంది యువకులు.. కుటుంబ పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య ఎలా జీవిస్తున్నారు? వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఎలాంటి మలుపు తీసుకొచ్చింది? అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని వంశీ వెల్లడించారు. ముఖ్యంగా ఓ పార్టీలో బిర్యానీ దగ్గర మొదలయ్యే పరిణామాలతో సినిమా మలుపు తిరుగుతుందని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. సంగీత దర్శకుడు స్మరణ్ మంచి వర్క్ ఇచ్చారని ప్రశంసించారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు విజయాలు సాధిస్తేనే టాలీవుడ్ కు మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే అమీర్ లోగ్ థియేట్రికల్ హక్కులను రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు వంశీ నందిపాటి మూవీ కోసం పాజిటివ్‌ గా మాట్లాడటం మరింత బజ్ తీసుకొస్తోంది. హైదరాబాదీ కల్చర్, యూత్‌ ఫుల్ కామెడీ, ఫ్రెండ్‌ షిప్, ఎమోషన్స్‌ కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే.. అమీర్ లోగ్ చిన్న సినిమాల్లో మరో సర్ప్రైజ్ హిట్‌ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.





Tags:    

Similar News