వరుస ఫ్లాప్స్ తర్వాత పూజాకు బంపర్ ఆఫర్?
టాలీవుడ్‌లో స్టార్ హీరోల హిట్ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.
టాలీవుడ్‌లో స్టార్ హీరోల హిట్ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్- పూజా హెగ్డే జోడీకి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. గతంలో వీరి కలయికలో వచ్చిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో సినిమాల్లో ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన తర్వాత ఈ కాంబోపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ జోడీ మూడోసారి కలిసి నటించే అవకాశాలు ఉన్నాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ రావడంతో ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక కూడా వేగంగా జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. యాక్షన్, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్, స్టైలిష్ టేకింగ్‌తో ఆయన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కెట్ సాధిస్తున్నాయి. అలాంటి డైరెక్టర్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తే ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో కనిపించిన పూజా, లోకేష్ స్టైల్ రా యాక్షన్ ప్రపంచంలో కొత్తగా కనిపించే అవకాశముందనే చర్చ నడుస్తోంది.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి. అదే పూజా హెగ్డే కెరీర్. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస భారీ అవకాశాలతో టాప్ హీరోయిన్‌ల జాబితాలో నిలిచిన ఆమెకు గత కొంతకాలంగా ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. కొన్ని భారీ సినిమాలు నిరాశపరచడంతో ఆమె కెరీర్ స్లో అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి టైమ్ లో అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ వంటి భారీ కాంబినేషన్‌లో అవకాశం దక్కితే అది పూజాకు గేమ్ ఛేంజర్ కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ఎంపిక జరుగుతోందని, తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, హిందీ ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు ఉన్న ఫేస్ ను టీమ్ కోరుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే పూజా హెగ్డే ఎంపికకు కమర్షియల్ కారణాలు కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అభిమానులైతే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కాంబోపై పోస్టులు, ట్రెండ్స్ మొదలుపెట్టేశారు. మూడోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?, అల వైకుంఠపురములో సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా? అంటూ డిస్కషన్స్ చేస్తున్నారు. మరోవైపు అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి కూడా నెలకొంది. అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూఈ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే వారాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.