బన్నీ బర్త్ డే ట్రీట్.. ప్లాన్ ఎలా ఉందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) అభిమానులకు ఒక పండుగలాంటిది. ఆ రోజు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఏదో ఒక భారీ అప్డేట్ వస్తుందనే ఆశతో ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) అభిమానులకు ఒక పండుగలాంటిది. ఆ రోజు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఏదో ఒక భారీ అప్డేట్ వస్తుందనే ఆశతో ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా టీజర్, గ్లింప్స్ వంటి విజువల్ ట్రీట్స్ కోసం భారీ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం అభిమానులు ఆశించిన స్థాయిలో వీడియో అప్డేట్ ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బన్నీ, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో భారీ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం బన్నీ కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ గా అంత భావిస్తున్నారు. ఆ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ లేదా టీజర్ విడుదల అవుతుందని అభిమానులు ఆశించినప్పటికీ, ఆ అంచనాలకు బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ, "నాకు తెలిసినంత వరకు బన్నీ పుట్టినరోజున ఎలాంటి వీడియో కంటెంట్ విడుదల చేసే ఆలోచన చిత్ర యూనిట్ కు లేదు. ఈసారి టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుంది" అని వెల్లడించారు. స్పెషల్ మూవీ కనుక స్పెషల్ ప్లాన్ తో మూవీ టీమ్ ఉందని, అందుకే విజువల్ ట్రీట్ ఇప్పుడు లేదని చెప్పారు.
అయితే ఆ సినిమా బన్నీ కెరీర్ లో చాలా స్పెషల్ కావడంతో మేకర్స్ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విజువల్స్ ను ఇప్పుడే బయటకు తీసుకురావడం వల్ల సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గిపోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ముందుగా టైటిల్, పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది.
దీంతో వీడియో అప్డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు కొంత నిరాశ కలిగినా, టైటిల్ అనౌన్స్మెంట్, స్పెషల్ పోస్టర్ పై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ అవుతోంది. బన్నీ బర్త్ డే సందర్భంగా వచ్చే పోస్టర్ ఎలా ఉండబోతుందో అనే చర్చలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఏదేమైనా బన్నీ బర్త్ డే నాడు స్టైలిష్ సర్ప్రైజ్ మాత్రం ఖాయం అయ్యింది.
ఇక సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనె నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక వంటి పలువురు హీరోయిన్లు ప్రాజెక్ట్ లో భాగమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే కాస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. బన్నీ పుట్టినరోజు నాడు ఆ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. మొత్తానికి ఈసారి బన్నీ బర్త్ డే సందర్భంగా వీడియో అప్డేట్ లేకపోయినా, టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.