ఎన్టీఆర్ సినిమాలో అల్లరి నరేష్.. ఇది అసలు నిజం

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో దేవర మూవీ గ్రాండ్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

Update: 2024-04-29 06:26 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో దేవర మూవీ గ్రాండ్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని ఓ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే గోవాలో మాసివ్ సాంగ్ ను షూట్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ తారక్ లుక్ ను రివీల్ చేస్తూ వెల్లడించారు.

నిజానికి కొద్ది రోజుల క్రితమే విడుదల కావాల్సి ఉన్న దేవర సినిమాను పలు కారణాలతో మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కామెడీ మూవీలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై స్పందించారు అల్లరి నరేష్. తాను దేవర సినిమాలో ఎలాంటి పాత్ర పోషించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వచ్చిన వార్తలన్నీ రూమర్లేనని తెలిపారు. అయితే తారక్ సినిమాలో ఛాన్స్ వస్తే కచ్చితంగా యాక్ట్ చేస్తానని చెప్పారు. టాలీవుడ్ హీరోలందరిలో ఎవరితోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి వచ్చిన నాగార్జున 'నా సామిరంగా' సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. పెళ్లి వయసు వచ్చినా మ్యారేజ్ కాని హీరో.. తన పార్టనర్ ను సెట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే విషయం చుట్టూ ఈ సినిమా తిరుగుతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓ చిన్న మెసేజ్ ను కూడా మేకర్స్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్షతో పాటు మరికొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మే 3వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News