సినిమా ఆడినా ఇక్కడే.. ఆడకపోయినా ఇక్కడే: అల్లరి నరేష్ భావోద్వేగ వ్యాఖ్యలు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ తనలోని భావాలను షేర్ చేసుకున్నారు. నాకు బాగా నచ్చిన సినిమా `నేను ఇంతే`.
సినిమా పరిశ్రమలో జయాపజయాలు చాలా సాధారణం. అయితే విజయం వస్తే ఎగిరిపడటం.. పరాజయం ఎదురైతే తీవ్రంగా కుంగిపోవడం సరికాదని హీరో అల్లరి నరేష్ పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల జీవితాల్లో జయాపజయాలు భాగమని, ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ తనలోని భావాలను షేర్ చేసుకున్నారు. నాకు బాగా నచ్చిన సినిమా `నేను ఇంతే`. దాంట్లో రవితేజ గారు అంటారు... ``సినిమా ఆడినా ఇక్కడే ఉంటాం.. సినిమా ఆడకపోయినా ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసింది సినిమా- సినిమా-సినిమా!`` అని. ఈ వారం కాకపోతే నెక్ట్స్ వారం, నెక్ట్స్ ఫ్రైడే మనది అని వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగానీ విజయం దక్కలేదని ఆగిపోకూడదు`` అని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమా పరాజయం పాలైనప్పుడు సమాజం ఆలోచించే విధానాన్ని కూడా అల్లరి నరేష్ తప్పుపట్టారు. సాధారణంగా సినిమా ఆడకపోతే వెంటనే హీరోనో లేదా డైరెక్టర్‌నో బ్లేమ్ చేస్తాం. కానీ సినిమా అనేది ఒక్కరి పని కాదు. ఇది 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన సాంకేతిక కలయిక. అన్ని క్రాఫ్ట్స్ సరిగ్గా కుదిరి.. కరెక్ట్ గా అలైన్ అయినప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది`` అని స్పష్టం చేశారు.
ఒక సినిమా కోసం పడే కష్టాన్ని.. ఫలితం తేడా కొట్టినప్పుడు వచ్చే బాధను ఆయన ఎంతో యథార్థంగా వివరించారు. ఒక సినిమా కోసం 6 నుండి 7 నెలలు కష్టపడి ప్రయాణం చేసినప్పుడు.. అది సరిగ్గా ఆడకపోతే తప్పకుండా నిరాశపడతాం. ఆ బాధ ఒక రెండు మూడు రోజులు ఉంటుంది. కానీ ఆ నొప్పులను తట్టుకుని మళ్లీ ముందుకు అడుగులు వేయడమే సినీ ప్రయాణమని నరేష్ స్ఫూర్తివంతమైన మాట చెప్పారు.
మరోవైపు.. సినిమా ఫ్లాప్ అయితే కేవలం హీరో లేదా దర్శకుడినే బాధ్యులను చేయడం సరికాదని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతర నటులు కూడా గళమెత్తారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఒక సందర్భంలో మాట్లాడూతూ.. బాక్సాఫీస్ వద్ద సినిమా ఆడకపోతే ఎప్పుడూ నటులనే నిందిస్తారు. కానీ దిశానిర్దేశం (డైరెక్షన్) సరిగ్గా లేకపోవడం... కథలో లోపాలు ఉండటం వల్ల కూడా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. దర్శకుడి తప్పు ఉన్నప్పుడు కేవలం నటుడిపై నిందలు వేయడం సముచితం కాదు! అని వ్యాఖ్యానించారు. అలాగే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు, విశ్లేషకులు సైతం జయాపజయాలు అనేది కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ -నిర్మాణ విలువల కలయికపై ఆధారపడి ఉంటుందని.. విఫలమైన ప్రతిసారీ కేవలం ఒకరిద్దరినే టార్గెట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ మాట్లాడుతూ 24 శాఖలు కలిసి కట్టుగా పని చేయకపోతే ఫలితం ఇబ్బందికరంగా వస్తుందని అన్నారు.