80 లక్షలతో తీస్తే 8 కోట్లు

సినిమా మొదలయ్యే సమయంలో ఎదురైన సవాళ్లను నరేష్ గుర్తు చేసుకున్నారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను సుమారు 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్లాన్ చేశారని చెప్పారు.

Update: 2026-09-06 04:35 GMT

టాలీవుడ్ లో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లు కొల్లగొట్టిన కల్ట్ కామెడీ క్లాసిక్ కితకితలు. దివంగత లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్, గీతా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూసేలా అలరిస్తుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్, ఈ సినిమా బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీని బయటపెట్టారు.

సినిమా మొదలయ్యే సమయంలో ఎదురైన సవాళ్లను నరేష్ గుర్తు చేసుకున్నారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను సుమారు 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్లాన్ చేశారని చెప్పారు. అయితే ఒక లావుగా ఉండే అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి తీస్తే సినిమా ఎవరు చూస్తారు, బయ్యర్లు ఎవరు కొంటారు అనే ప్రశ్నలు, సందేహాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. దీంతో రిస్క్ తగ్గించుకోవడానికి బడ్జెట్‌ను ఏకంగా 80 నుంచి 90 లక్షల రూపాయల స్థాయికి కుదించి ప్రాజెక్ట్ మొదలుపెట్టారని వివరించారు.

కథపై దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ఉన్న క్లారిటీ గురించి నరేష్ వివరణ ఇచ్చాడు. కథకు ఎవరు కావాలో వారినే పెట్టాలన్నది ఈవీవీ సిద్ధాంతం. ఐశ్వర్యా రాయ్ లాంటి అందమైన అమ్మాయిని భార్యగా ఊహించుకున్న ఒక సాధారణ కుర్రాడికి, ఊహించని విధంగా కల్పనారాయ్ లాంటి పర్సనాలిటీ ఉన్న అమ్మాయి భార్యగా వస్తే అతడి పరిస్థితి ఏంటి అనే ఆలోచన చుట్టూ ఈ కథను అల్లారని, ఆ పాయింట్‌తోనే తన సందేహాలన్నీ తీరిపోయాయని నరేష్ పేర్కొన్నారు.

ఈ సినిమా షూటింగ్ విధానం కూడా చాలా ప్రత్యేకంగా సాగింది. సాధారణంగా ఈవీవీ సత్యనారాయణ సినిమాలకు విరామం లేకుండా పనిచేస్తుంటారు. కానీ కితకితలు చిత్రాన్ని సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూట్ చేసి, శని ఆదివారాల్లో హాలిడేస్ ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. పరిమిత వర్కింగ్ డేస్‌లోనే ఎంతో పక్కా ప్లానింగ్‌తో తక్కువ ఖర్చులో చిత్రీకరణ పూర్తి చేశారు.

రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని రికార్డులు సృష్టించింది. కేవలం 80 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి పెట్టిన పెట్టుబడికి పది రెట్ల లాభాలను తెచ్చిపెట్టిందని నరేష్ స్పష్టం చేశారు. హీరోయిన్ గీతా సింగ్‌కు ఈ చిత్రమే కెరీర్‌లో క్లెయిమ్ టు ఫేమ్ అయిందని, డబ్బింగ్ నుంచి యాక్టింగ్ వరకు ఆమె ప్రాణం పెట్టి నటించిందని ప్రశంసించారు.

సినిమా సృష్టించిన సామాజిక ప్రభావం ఎంత బలంగా ఉందో చెబుతూ నరేష్ ఒక సరదా ఇన్సిడెంట్ చెప్పారు. సినిమా ఆడుతున్న రోజుల్లో ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో ఒక మహిళ నేరుగా వచ్చి తన షర్ట్ పట్టుకుని, లావుగా ఉంటే పెళ్లాన్ని వదిలేస్తావా, లావుగా ఉండటంలో తప్పేంటయ్యా అంటూ నిలదీసిందని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News