మ‌ర‌ణ‌శ‌య్య‌పై తండ్రి.. షూటింగ్ చేయాలా వ‌ద్దా? అల్లరి నరేష్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ!

సినిమా పరిశ్రమలో నవ్వులు పూయించే న‌టుల జీవితాల్లో ఎన్నో గుండెకోతలు, బాధలు దాగి ఉంటాయని అల్లరి నరేష్ మాటలు వింటే అర్థమవుతుంది.

Update: 2026-09-11 03:44 GMT

సినిమా పరిశ్రమలో నవ్వులు పూయించే న‌టుల జీవితాల్లో ఎన్నో గుండెకోతలు, బాధలు దాగి ఉంటాయని అల్లరి నరేష్ మాటలు వింటే అర్థమవుతుంది. తన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్న సమయంలో నరేష్ ఎదుర్కొన్న పరిస్థితులు అత్యంత హృదయ విదారకం. ఒకవైపు తండ్రి ఆసుపత్రిలో ఉంటే.. మరోవైపు తండ్రి జ్ఞాపకాలతోనే షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చిన దారుణమైన పరిస్థితిని నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు.

తన తండ్రి కడసారి చూపులకు నోచుకోలేని స్థాయిలో తాను ఆ సమయంలో తీవ్రమైన షూటింగ్ షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్నానని నరేష్ తెలిపారు. `సీమ టపాకాయ్` సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నా కానీ షూటింగ్‌ను ఆపలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ సన్నివేశంలో నటించే దాదాపు 40 మంది నటీనటులు విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వారు వెళ్లిపోతే మళ్లీ రెండు నెలల వరకు దొరకరనే కారణంతో... నరేష్ మనసులోనే దుఃఖాన్ని దాచుకుని షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది.

ఈ నిర్ణయం వల్ల తన సొంత సోదరుడితో పాటు అనేకమంది నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి అంత్యక్రియల రోజు సాయంత్రం వరకు కూడా తాను కెమెరా ముందు నటించక తప్పలేదు. సెట్‌లో `రోబో` సినిమా స్పూఫ్ సాంగ్స్, క్లైమాక్స్ కామెడీ సీన్స్ చేస్తున్నంత సేపూ నవ్వుతూ నటించి.. షాట్ కాగానే బయటకు వచ్చి ఏడ్చేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ మానసిక వేదన కారణంగానే ఇప్పటివరకు `సీమ టపాకాయ్` చిత్రాన్ని తాను చూడలేదని ఆయన చెప్పారు.

షూటింగ్ స్పాట్‌లో ఎం.ఎస్. నారాయణ వంటి సీనియర్ నటులు తనకు ధైర్యం చెబుతూ.. ``ఏం కాదు.. నాన్నకి ఏం కాదు`` అని ఓదారుస్తుంటే మరింత దుఃఖం పొంగిపొర్లేదని నరేష్ అన్నారు. తన జీవితంలో తండ్రి కేవలం మార్గదర్శి మాత్రమే కాదని... ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా నిలిచారని భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి మరణం తర్వాత ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి తనకు కొన్ని నెలల సమయం పట్టిందని.. ప్రారంభంలో 99 శాతం నిజం తెలిసినా.. ఎక్కడో ఒక‌ శాతం ఆయన తిరిగి వస్తారనే ఆశ ఉండేదని చెప్పారు.

ఎంతటి విషాదం ఆవహించినా నమ్మిన నిర్మాతకు... శ్రేయోభిలాషులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో నరేష్ ప్రదర్శించిన వృత్తి పటిమ నిజంగా అభినందనీయం. కంటి నిండా నీళ్లు సుడులు తిరుగుతున్నా.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించడానికి ఆయన పడిన వేదన ఒక నటుడి జీవితంలో ఎంతటి త్యాగం ఉంటుందో చాటిచెబుతోంది. ఈ ఘటన అల్లరి నరేష్ వ్యక్తిత్వానికి.. సినిమాపై అత‌డికి ఉన్న అంకితభావానికి అద్దం పడుతోంది. అల్ల‌రి న‌రేష్ న‌టించిన `రంభ ఊర్వ‌శి మేన‌క` చిత్రం ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. న‌రేష్ త‌న‌దైన మార్క్ హాస్యంతో ఆక‌ట్టుకున్నారు.

Tags:    

Similar News