హాలీవుడ్ నిపుణులతో ఇండియా తొలి ఏలియన్ థ్రిల్లర్!
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ సరికొత్త సరిహద్దులను కలిపేందుకు సిద్ధమయ్యారు.
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ సరికొత్త సరిహద్దులను కలిపేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఏలియన్ హారర్ థ్రిల్లర్ చిత్రానికి `సముక్` అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. కనిష్క్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్షయ్ కుమార్ స్వయంగా విపుల్ అమృతలాల్ షా, ఆశిన్ షాలతో కలిసి నిర్మిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అక్షయ్ కుమార్- విపుల్ షాల కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఇండస్ట్రీ వర్గాలలో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు.
`సముక్` కథ , దాని నేపథ్యం తనని ఎంతగానో ఆకట్టుకుందన్నారు. సైన్స్ ఫిక్షన్ ఏలియన్ హారర్ అనేది తన కెరీర్‌లోనే కాక భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత అరుదైన జానర్ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినా? ఈ తరహా కథాంశంతో సినిమా చేయడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ నిపుణులు భాగస్వామ్యమయ్యారు. `మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్`, `వెనమ్`, `స్టార్ వార్స్` వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు స్టంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన లూక్ టంబర్ ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్‌ను ఇండియన్ సినిమాకు దొరికిన అసలైన యాక్షన్ హీరోగా లూక్ అభివర్ణించారు. భారతీయ కథా విధానానికి హాలీవుడ్ యాక్షన్ నైపుణ్యాలను జోడించి అంతర్జాతీయ స్థాయి లైవ్-యాక్షన్ విజువల్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చలనచిత్ర రంగంలో విజువల్ ఎఫెక్ట్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల హవా నడుస్తున్న తరుణంలో `సముక్` బృందం ఓ విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఈ సినిమాలోని ఏలియన్ రూపాన్ని కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా? ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ , సాంప్రదాయ హ్యాండ్‌క్రాఫ్టెడ్ పద్ధతుల్లో రూపొందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు నామినేషన్ పొందిన ప్రముఖ హాలీవుడ్ క్రియేచర్ డిజైనర్ అలెక్ గిల్లిస్ ఈ బాధ్యతను చేపట్టారు.
`ఏలియన్: రోములస్`, `ప్రెడేటర్` వంటి ఐకానిక్ చిత్రాలకు పనిచేసిన అలెక్, దర్శకుడు కనిష్క్ వర్మతో కలిసి ఈ సినిమా కోసం భయంకరమైన సరికొత్త ఏలియన్ రాక్షస రూపాన్ని సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. అక్షయ్ కుమార్ శారీరక దృఢత్వాన్ని, స్క్రీన్ ప్రెజెన్స్‌ను హాలీవుడ్ స్టార్స్ జేసన్ స్టాథమ్, టామ్ క్రూజ్‌లతో పోల్చిన అలెక్ గిల్లిస్ ఆయనను ఢీకొట్టే విలన్‌ను సృష్టించడం సవాలుతో కూడుకున్న విషయమన్నారు. తెరపై అక్షయ్ కుమార్‌కు సరిసమానమైన క్రేజ్, ఎనర్జీని ప్రతిబింబించేలా ఏలియన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇంతటి శక్తివంతమైన క్లాసిక్ మూవీ మాన్‌స్టర్‌ను ఎదుర్కోవడం , దానిని ఓడించడం సినిమాలో హీరోకి కూడా అంత సులువైన టాస్క్ కాదని అలెక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సాయంతో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న `సముక్` భారతీయ చలనచిత్ర రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. విజువల్స్.. బలమైన కథా బలంతో రానున్న ఏలియన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. వినూత్నమైన ఆలోచనలు, అంతర్జాతీయ యాక్షన్ మేకింగ్ శైలి కలబోసి వస్తున్న చిత్రం రాబోయే రోజుల్లో భారతీయ సినిమా మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశం లేకపోలేదు.