మొదటి రోజు అఖిల్ కెరీర్ బెస్ట్.. పాజిటివ్ మౌత్ టాక్ ప్లస్!
ఒకవేళ కలెక్షన్లు 15 కోట్ల మార్కును దాటితే గనుక అఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుగా నమోదు కానుంది.
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం `లెనిన్` థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అఖిల్ గత చిత్రాలతో పోలిస్తే మిశ్రమ స్పందనలతో ఈ సినిమాకు పెద్దగా నెగటివ్ రివ్యూలు ఏమీ రాకపోవడం విశేషం. మెజారిటీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందనే వ్యక్తమవుతోంది. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ సినిమా బాగుందంటూ సానుకూలంగా స్పందిస్తుండటంతో, లభించిన పాజిటివ్ మౌత్ టాక్ సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
`లెనిన్` చిత్రం బి, సి సెంటర్ల ప్రేక్షకులను భారీగా ఆకర్షిస్తూ బాక్సాఫీస్ వద్ద ఘనమైన పరుగును అందుకుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 13 కోట్ల నుండి 15 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కలెక్షన్లు 15 కోట్ల మార్కును దాటితే గనుక అఖిల్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుగా నమోదు కానుంది.
ఈ చిత్రంలో లెనిన్ పాత్రలో అఖిల్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గత సినిమాలతో పోలిస్తే అఖిల్ నటుడిగా ఎంతో పరిణతి చెందాడని పలు సమీక్షలలో క్రిటిక్స్ ప్రశంసించారు. భావోద్వేగ సన్నివేశాలలో, యాక్షన్ సీక్వెన్స్‌లలో అఖిల్ పలికించిన హావభావాలు, నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని.. కథను తన భుజాలపై నడిపించాడని విమర్శకులు ప్రత్యేకంగా కీర్తిస్తున్నారు.
నిజానికి అఖిల్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో. మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ సినిమా కోసం ఎంతగా కష్టపడతారో.. అఖిల్ కూడా సినిమా కోసం అంతే కష్టపడే తత్వాన్ని తన తండ్రి కింగ్ నాగార్జున నుండి అందిపుచ్చుకున్నాడు. తన మొదటి సినిమా `అఖిల్` నుండి కూడా అతడిలో కష్టపడాలనే తపన, కసి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తూ గతంలో అతడు ఆశించిన స్థాయిలో పెద్ద విజయాలు దక్కలేదు. కానీ `లెనిన్` ఇచ్చిన పాజిటివ్ వర్డ్ .. సక్సెస్‌తో ఇప్పుడు అఖిల్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
ఈ పాజిటివ్ మౌత్ టాక్ ఇలాగే కొనసాగితే మొదటి వారాంతం (ఫస్ట్ వీకెండ్) ముగిసేసరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ వసూళ్లను సాధించేందుకు ఆస్కారం ఉంది. ఈ విజయంతో అఖిల్ కెరీర్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మొదటి పెద్ద కమర్షియల్ హిట్ దక్కినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చిత్రబృందం ఎంతో ఉత్సాహంగా, ఎమోషనల్‌గా కనిపిస్తుండగా.. తాజా పాజిటివ్ టాక్ అక్కినేని అభిమానుల్లో సరికొత్త పూనకాలను నింపుతోంది.