AI రివల్యూషన్: బడ్జెట్ లేక ఆగిపోయే కథలు ఇక ఉండవు!
AIతో అన్ని పనులు అవుతాయి.. అదే సమయంలో AI మిస్ ఫైర్ అవ్వడానికి ఛాయిస్ లేకపోలేదు. రాజును సింహాసనంపై కూర్చోబెట్టే `సాంకేతికత` ఇప్పుడు ఒక సామాన్యుడి చేతిలోకి కూడా వచ్చేసింది.;
AIతో అన్ని పనులు అవుతాయి.. అదే సమయంలో AI మిస్ ఫైర్ అవ్వడానికి ఛాయిస్ లేకపోలేదు. రాజును సింహాసనంపై కూర్చోబెట్టే `సాంకేతికత` ఇప్పుడు ఒక సామాన్యుడి చేతిలోకి కూడా వచ్చేసింది. కానీ సామాన్యుడి చేతిలో మిస్ ఫైర్ అయితే పరిస్థితేంటి?
వినోదరంగంలో కృత్రిమ మేథ పెను ప్రకంపనాలు సృష్టించబోతోందని టెక్ గురువులు చెబుతున్నారు. AI సాంకేతికత అందుబాటులోకి రావడంతో సినిమా మేకింగ్ మరింత సులువు అవుతుందనేది ఎంతటి వాస్తవమో, కంటెంట్ ని విస్మరిస్తే ఏఐ మిస్ ఫైర్ అవుతుందనేది కూడా అంతే వాస్తవమని విశ్లేషిస్తున్నారు. దీనిని ఫిలింమేకర్స్ పక్కాగా గమనిస్తున్నారు.
అంతేకాదు..ఇకపై సినిమా కథను చెప్పే విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు బలంగా ఉన్నాయి. ఊహకు అందని విజువల్స్ - ఏఐ మాయాజాలం ఇప్పటికే అంతర్జాలంలో కనిపిస్తూనే ఉంది. గతంలో ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై చూపించాలంటే కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు లేదా వీఎఫ్ఎక్స్ టీమ్స్ అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు జెనరేటివ్ AI (సోరా, వ్యూవో వంటివి) సహకారంతో మన ఆలోచనను టెక్స్ట్ రూపంలో ఇస్తే అది కళ్ళకు కట్టినట్లు వీడియోగా మారిపోతోంది. అంటే బడ్జెట్ లేక ఆగిపోయే కథలు ఇక ఉండవు అనే దీని అర్థం. జెనరేటివ్ ఏఐలో చేసే వీడియోలు గుణశేఖర్ `రుద్రమదేవి` క్లైమాక్స్ లా హాఫ్ బేక్డ్ గా మిగలదని కూడా భరోసానిస్తున్నారు టెక్ నిపుణులు. మారే కాలంతో పాటు ఇందులో వివిధ దశలు ఉండొచ్చు.
ఖర్చు తగ్గుతుంది.. నాణ్యత పెరుగుతుంది:
ఒకప్పుడు స్టూడియోలు.. భారీ కెమెరాలు ఉంటేనే సాధ్యమయ్యే పనులు ఇప్పుడు ఒక స్మార్ట్‌ఫోన్.. కొన్ని ఏఐ టూల్స్‌తో సాధ్యమవుతున్నాయనేది ఒక విశ్లేషణ. ``హై ఎండ్ ప్రొడక్షన్ ఎట్ లో కాస్ట్`` అనేది ఇప్పుడు నినాదం. దీనివల్ల ప్రతిభ ఉన్న సామాన్యుడు కూడా రాజమౌళి రేంజ్ విజువల్స్‌ను తన ల్యాప్‌టాప్‌లోనే సృష్టించగలడనే కాన్ఫిడెన్స్ ని టెక్ గురూలు తమ వీడియోల ద్వారా విశ్లేషిస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.
పర్సనలైజ్డ్ స్టోరీ టెల్లింగ్
ముందు ముందు కథలు కేవలం చూడటానికే కాదు.. వాటిలో మనం కూడా ఒక పాత్ర అయ్యేలా సాంకేతికత (AR/VR) మారుతోంది. కథానాయకుడు ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి? అనేది ప్రేక్షుకుడే నిర్ణయించే `ఇంటరాక్టివ్ సినిమా` మరింత అందుబాటులోకి రాబోతోంది. ఇది నిజంగా విప్లవాత్మకం కాబోతోంది. దీని అర్థం ఇకపై సినిమాలో ఎవరికి వారే హీరోలు. అప్పుడు ప్రజలు ఎవరిని అంగీకరిస్తారు? అనేది సంక్లిష్ఠంగా మారబోతోంది. ఇది వినేందుకే చాలా గమ్మత్తుగా ఉంది కదూ?
భాషా సరిహద్దులు లేవు:
టెక్నాలజీ పుణ్యమా అని `డబ్బింగ్` అనే పదానికి అర్థం మారిపోతోంది. ఏఐ వాయిస్ క్లోనింగ్ ద్వారా ఒక తెలుగు కథను, ప్రపంచంలోని ఏ భాషలోకైనా అదే ఎమోషన్‌తో క్షణాల్లో మార్చేయవచ్చు. అంటే మీ కథ ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది. సినిమా రూపంలో కనబడుతుంది కూడా.
టెక్నాలజీ అనేది కేవలం ఒక `కలం` లాంటిది మాత్రమే. ఆ కలంతో అద్భుతమైన కావ్యం రాస్తావా లేదా మామూలు రాతలు రాస్తావా? అనేది రచయిత మెదడులో ఉండే కంటెంట్ క్రియేటివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. ఎవరైతే సాంకేతికతను ఉపయోగిస్తున్నారో ఆ వ్యక్తి అభిరుచిని కూడా ఔట్ పుట్ ప్రతిబింబిస్తుంది. అందుకే టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆత్మ లేని విజువల్స్ కంటే.. గుండెను తాకే కథే ఎప్పుడూ విజేతగా నిలుస్తుంది. అలాంటి హృదయాల్ని గెలుచుకునే కథల్ని ఎవరు రాస్తారో, కథలతో పాటు సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటారో వారు మాత్రమే భవిష్యత్ ని నిర్ధేశించే దర్శకులుగా మారబోతున్నారు. ఇది నిజంగా అనూహ్య పరిణామం. భవిష్యత్ లో సాంకేతికత ఇంకా ఎన్ని విచిత్ర పోకడలకు మారుతుందో వేచి చూడాలి.