ఆదర్శ కుటుంబంతో వాళ్ల‌కి ఇబ్బందే!

బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల తేదీల మార్పులు, సర్దుబాట్లు పరిశ్రమలో ఎప్ప‌టిక‌ప్పుడు చర్చకు దారితీ స్తుంటుంది.

Update: 2026-10-06 16:24 GMT

బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల తేదీల మార్పులు, సర్దుబాట్లు పరిశ్రమలో ఎప్ప‌టిక‌ప్పుడు చర్చకు దారితీ స్తుంటుంది. పెద్ద సినిమా విడుదల తేదీ మారితే? ఆ ప్రభావం నేరుగా అదే సమయానికి షెడ్యూల్ అయిన ఇతర చిత్రాలపై పడుతుంది. తాజాగా `ఆదర్శ కుటుంబం` సినిమా విడుదల తేదీపై జరుగుతున్న ప్రచారాలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవేళ ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30కి వాయిదా పడితే? ఆ తేదీన ఇప్పటికే క్యూలో ఉన్న యంగ్ హీరోల సినిమాలకు గట్టి పోటీ త‌ప్ప‌దు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లు, వైవిధ్యమైన కథలతో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీని లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు తమ చిత్రాల విడుదలను ఖరారు చేసుకున్నారు. మాస్ అండ్ క్లాస్ అప్పీల్‌తో దూసుకెళ్తున్న విశ్వక్సేన్(క‌ల్ట్), విభిన్న కథా పాత్రలతో ప్రేక్షకులను అలరించే రోషన్ మేకా(ఏమో ఏమో ఇది), అలాగే యంగ్ హీరో అనీష్‌ల( ఇట్లు అర్జున సోల్ ఆఫ్ అర్జున‌) సినిమాలు ఇదే తేదీకి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో `ఆదర్శ కుటుంబం` లాంటి క్రేజీ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా అక్టోబర్ 30 రేసులోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. థియేటర్ల కేటాయింపు నుంచి కలెక్షన్ల వరకు అన్ని రంగాలపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్ద సినిమాలకు సాధారణంగానే ఎక్కువ థియేటర్లు దక్కుతాయి. కాబట్టి అదే రోజు విడుదల కావాల్సిన చిన్న, మధ్య తరహా చిత్రాలకు థియేటర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది యంగ్ హీరోల నిర్మాతలకు ఆర్థికంగానూ ఆందోళన కలిగించే అంశమే.

అయితే బాక్సాఫీస్ వద్ద ఇలాంటి క్లాషెస్ రావడం టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. పండుగ సీజన్లు కాకపోయినా? సాధారణ వారాంతాల్లోనూ రెండుమూడు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుంటాయి. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా? పెద్ద సినిమా? అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అన‌డానికి చాలా ఉదాహరణలున్నాయి. అయినా? బిజినెస్ పరంగా, సోలో రిలీజ్ దక్కించుకోవాలనే ప్రణాళికల పరంగా యంగ్ హీరోల జంటలకు ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది.

ఈ పోటీ థియేటర్ల సంఖ్యకే పరిమితం కాదు. బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రతి చిత్రం వినూత్న ప్రచార కార్యక్రమాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఒకే రోజు ఇన్ని సినిమాలు వస్తే ఓపెనింగ్స్ చీలిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆయా చిత్రాల నిర్మాతలు, పంపిణీదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అంతిమంగా `ఆదర్శ కుటుంబం` వాయిదా పడితే మాత్రం అక్టోబర్ 30 బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారడం ఖాయం. అనీష్, విశ్వక్సేన్, రోషన్ మేకా వంటి యువ నటుల సినిమాలు భారీ పోటీని ఎలా ఎదుర్కొంటాయి? ప్రేక్షకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అనేది ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News