ప్రముఖ హీరో శివాజీ రాజాకి పితృవియోగం.. అసలు ఎలా జరిగిందంటే?
చిత్ర పరిశ్రమలో ఒకవైపు పెళ్లి భాజాలు మోగుతుంటే.. మరొకవైపు ఇలా సెలబ్రిటీల ఇళ్లల్లో విషాదాలు అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.;
చిత్ర పరిశ్రమలో ఒకవైపు పెళ్లి భాజాలు మోగుతుంటే.. మరొకవైపు ఇలా సెలబ్రిటీల ఇళ్లల్లో విషాదాలు అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి పరమపదించారు. శివాజీ తండ్రి జి. రామరాజు మంగళవారం ఉదయం 8:00 గంటలకు మధురానగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 85 సంవత్సరాలు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జి.రామరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది.
అంత్యక్రియలు నేడే..
రామరాజు భౌతికకాయాన్ని సందర్శనార్థం వారి నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక శివాజీ రాజా తండ్రి మరణ వార్త విని అటు అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మరి కొంతమంది నేరుగా కలిసి సానుభూతి తెలియజేస్తుంటే.. మరి కొంతమంది ఫోన్ కాల్ ద్వారా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే శివాజీ రాజా తండ్రి మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శివాజీ రాజా సినిమా జీవితం..
1985లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివాజీ రాజా తన సినీ కెరియర్ లో 260కి పైగా చిత్రాలలో నటించాడు.ఎం.వి రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన 'కళ్ళు' అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరు గల చిత్రంలో నటుడిగా నటించి ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. పెళ్లి సందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారీ వంటి చిత్రాలలో తన విభిన్నమైన నటనతో ఊహించని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే అమృతం సీరియల్ లో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్ర అయిన అమృతం పాత్రను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే సంబరాల రాంబాబు అనే సీరియల్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు.
శివాజీ రాజా బాల్యం, విద్యాభ్యాసం..
1962 ఫిబ్రవరి 26న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించారు శివాజీ రాజా. ఈయన తండ్రి భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాలలో అటెండర్ గా పనిచేసేవారు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది. ఇక ప్రస్తుతం అక్కడి నుండి హైదరాబాదుకి షిఫ్ట్ అయిన వీరు ఇక్కడే పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శివాజీ రాజా.