అచ్చన్న ఆవేదన విన్నారా బాబూ ..!
రాష్ట్రంలో మంత్రులు కొందరు బాగానే పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు.;
రాష్ట్రంలో మంత్రులు కొందరు బాగానే పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. ఇలాంటి వారిలో తరచుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చం నాయుడు గత నాలుగు మాసాలుగా సోషల్ మీడియాలో విపరీత స్థాయిలో ట్రోల్ అవుతున్నారు. సూపర్ సిక్స్ హామీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు.. తర్వాత వైసీపీ నాయకుల విషయంలో చేసిన విమర్శలు.. తాజాగా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో అచ్చన్నని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
`ఆడబిడ్డ నిధి` పథకంపై ఆయన గతంలో చేసిన విమర్శ తీవ్ర స్థాయిలో కుదిపేసింది. అయితే దీనిని చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని కొంతవరకు సర్దుబాటు చేయగలిగారు. `ఆడబిడ్డ నిధి`ని అమ లు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేయాల్సి ఉంటుందన్నది అచ్చం నాయుడు చేసిన వ్యాఖ్య. దీనిపై సోషల్ మీడి యాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వైసీపీ నాయకులకు చీరలు పంపిస్తామని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలని వ్యాఖ్యానించి కూడా ఆయన అభాసుపాలయ్యారు.
రాజకీయాల్లో విమర్శలు కామనే అయినా.. ఇట్లాంటి విమర్శలు సరికాదు అన్నది అందరికీ తెలిసిందే. పైగా సీనియర్ నాయకుడు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కూడా చేసిన అచ్చన్నాయుడు.. ఎందుకో సహనం కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటీవల బఫే భోజనానికి.. రైతుల ఎరువులకు ముడిపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఒకవైపు రైతులు.. ఎరువులు లభించక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంటే, ఆ సమస్యను సరైన విధంగా పరిష్కరించాల్సిన స్థాయిలో ఉన్న మంత్రి భోజనానికి ఎగబడినట్టు రైతులు ఎగబడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలతో సమస్య మరింత పెరిగింది తప్ప తగ్గింది లేదు. సో దీనిపై కూడా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిగా విమర్శలు వినిపించాయి. అయితే, అసలు అచ్చం నాయుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు.. ఆయనకు తెలియదా.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని ఆయనకి ఆలోచన లేదా అంటే కచ్చితంగా ఉంటుంది. అయినా, సీనియర్ నాయకుడు కాబట్టే ఆయన కచ్చితంగా ఒక అంచనా ఉంటుంది ఒక ఆలోచన కూడా ఉంటుంది.
అయితే, మనసులో పేరుకుపోయిన అసహనం అసంతృప్తి కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట, మంత్రివర్గంలో ఆయన హోం శాఖను కోరుకున్నారు, ఈ విషయాన్ని గతంలోనే ఆయన చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఆయనకు వ్యవసాయ శాఖను కేటాయించారు, ఇదే ఆయనలో ఉన్న అసంతృప్తికి ప్రధాన కారణం. మరి ఈ విషయాన్ని చంద్రబాబు పట్టించుకుని సరి చేస్తారా లేదా అనేది చూడాలి.