టాలీవుడ్‌లోకి మ‌రో హిందీ హీరో ఎంట్రీ

ప్రభాస్ తో `రాజా సాబ్` లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించింది పీపుల్స్ మీడియా సంస్థ‌.;

Update: 2025-10-27 05:39 GMT

ప్రభాస్ తో `రాజా సాబ్` లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించింది పీపుల్స్ మీడియా సంస్థ‌. ఇటీవ‌లే తేజ స‌జ్జాతో `మిరాయ్` లాంటి పాన్ ఇండియా హిట్టు సాధించిన త‌ర్వాత ఇది మ‌రో భారీ రిలీజ్ కానుంది. సంక్రాంతి బ‌రిలో రాజా సాబ్ విడుద‌ల కానుంది. త‌దుప‌రి అడివిశేష్ తో `గూడాచారి-2` లాంటి భారీ ఫ్రాంఛైజీ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు పీపుల్స్ మీడియా సంస్థ‌ మ‌రో భారీ పాన్ ఇండియా సినిమాని నిర్మించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల క‌ల‌యిక‌తో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ బావ‌మ‌రిది, అర్పితా ఖాన్ భ‌ర్త ఆయుష్ శ‌ర్మ ఒక కీల‌క పాత్ర‌లో న‌టించనున్నారు.

లవ్ యాత్రి, యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ వంటి చిత్రాలతో బాలీవుడ్ లో పాపుల‌రైన‌ ఆయుష్ శర్మ పీపుల్స్ మీడియా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. ఈ వార్తను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించింది. ``ప్రతిభావంతులైన ఆయుష్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కుటుంబంలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది`` అని తెలిపింది. ``ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో జట్టుకట్టడం గొప్ప గౌరవం. కొన్నేళ్లుగా నేను ఈ సంస్థ‌ నిర్మించిన చిత్రాలను చూస్తున్నాను. ఇది నాకు ఎల్లప్పుడూ సినిమాటిక్ ట్రీట్. భారతీయ సినిమాలో బౌండ‌రీస్ అధిగ‌మించిన‌ నిర్మాణ సంస్థలలో ఇది ఒకటి అని నమ్ముతున్నాను. ఈ ప్రయాణానికి నేను ఉత్సాహంగా ఉన్నాను`` అని ఆయుష్ శర్మ చెప్పారు.

ఆయుష్ శర్మ చివరిసారిగా 2024 ఏప్రిల్‌లో విడుదలైన రుస్లాన్ చిత్రంలో కనిపించాడు. దీనికి ముందు 2021లో యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్‌లో కనిపించాడు. ఆయుష్ శర్మ 2018లో సల్మాన్ ఖాన్ నిర్మాణంలోని `లవ్‌యాత్రి`తో క‌థానాయ‌కుడిగా ఆరంగేట్రం చేసాడు. వారినా హుస్సేన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది.

ఆయుష్ త‌దుప‌రి క్వాతా అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అలాగే `మై పంజాబీ నికాహ్` అనే చిత్రంలోను న‌టిస్తున్నాడు. ఇప్పుడు పీపుల్ మీడియా సినిమాకి సంత‌కం చేసాడు. పాన్ ఇండియాలో స‌త్తా చాటుతున్న తెలుగు ఇండస్ట్రీలో న‌టించేందుకు అత‌డిలోని త‌హ‌త‌హ చూశాక‌ టాలీవుడ్ క్రేజ్ హిందీ స్టార్ల‌లో ఏ రేంజులో ఉందో కూడా ప్ర‌పంచం అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News