టైగ‌ర్ ష్రాఫ్‌పై కాల్పులలో ట్విస్టు: స‌ల్మాన్-టైగ‌ర్- అమీర్.. ఎవ‌రు అస‌లు టార్గెట్?

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో అత్యంత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2026-10-26 03:59 GMT

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో అత్యంత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు మొదట బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దర్యాప్తు వివరాలు ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గతంలో జూలై 2026లో అమీర్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు చెప్పుకుంటున్న వ్యక్తుల (ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ వంటి పేర్లతో) నుంచి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ, `లవ్ జిహాద్`ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తూ వారికి సంబంధించిన వాయిస్ నోట్స్ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ముంబై పోలీసులు ఈ ఆడియో క్లిప్స్ , పోస్ట్‌ల ప్రామాణికతను పరిశీలించినా.. అమీర్ ఖాన్ .. ఆయన బృందం మాత్రం ఎలాంటి అధికారిక పోలీసు ఫిర్యాదు చేయలేదు.

అయితే అక్టోబర్ 2026లో టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసుకు సంబంధించి నిందితులను విచారించిన పోలీసులకు విస్మయకరమైన విషయాలు తెలిశాయి. హర్యానా నుంచి ముంబైకి వచ్చిన ఫూల్ సింగ్ , రెహాన్ అన్సారీ అనే నిందితులు సెప్టెంబర్ 20న నగరానికి చేరుకున్నారు. అమీర్ ఖాన్ బాంద్రా నివాసం చుట్టూ కనీసం మూడుసార్లు, దాదాపు నెల రోజుల పాటు ముమ్మరంగా రెక్కీ (నిఘా) నిర్వహించారు. కానీ అమీర్ ఖాన్ తరచూ షూటింగ్స్‌లో బిజీగా ఉండటం లేదా ఎక్కువగా ఇంటి లోపలే గడపడంతో ఆయనపై దాడి చేసే ప్రణాళికను వారు మధ్యలోనే విరమించుకున్నారు.

అమీర్ ఖాన్ అందుబాటులో లేకపోవడంతో షూటర్లు తమ టార్గెట్‌ను టైగర్ ష్రాఫ్‌కు మార్చారు. టైగర్ ష్రాఫ్ మరింత సులభంగా అందుబాటులో ఉండటం.. జుహూ ప్రాంతంలో క్రమం తప్పకుండా ఫుట్‌బాల్ ఆడటం వంటి అంశాలను గమనించిన గ్యాంగ్ ఆపరేటివ్స్ ఆయనపై దృష్టి సారించినట్లు పోలీసుల విచారణ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పుల ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు మరింత విస్తృతమవుతోంది. నిందితుల విచార‌ణ‌లో ఒక‌సారి స‌ల్మాన్ ప్ర‌ధాన టార్గెట్ అని కాదు.. టైగ‌రే ప్ర‌ధాన టార్గెట్ అని చెప్పారు. ఇప్పుడు అమీర్ ఖాన్ అస‌లైన టార్గెట్ అని చెప్పిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఇంకా ఎంత‌మందిని టార్గెట్ చేస్తోంది ఈ గ్యాంగ్ అనే టెన్ష‌న్ మొద‌లైంది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కదలికలు. ముంబైలో వారి నెట్‌వర్క్.. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్న తీరుపై ముంబై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో బాలీవుడ్ ప్రముఖుల భద్రత - రక్షణపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస‌క్తిక‌రంగా టైగ‌ర్ పై కాల్పుల‌కు పాల్ప‌డిన వారిని విచారించ‌గా.. అమితాబ్ బ‌చ్చ‌న్, అమీర్ ఖాన్, అక్ష‌య్ కుమార్ ఇండ్ల‌కు ఒక సాధార‌ణ యాత్రికుల మాదిరి ప‌ర్య‌టించామ‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఇంకా ఎక్కువ మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు ఉన్నార‌నే ఆందోళ‌న పోలీసుల‌కు ఉంది.

Tags:    

Similar News