అగ్రహీరో నట వారసత్వం: మేనల్లుడు అంతర్థానం- కొడుకు ప్రశ్నార్థకం!
బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్షనిస్ట్` అమీర్ ఖాన్ తన వైవిధ్యమైన సినిమాలతో నటనతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు.;
బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్షనిస్ట్` అమీర్ ఖాన్ తన వైవిధ్యమైన సినిమాలతో నటనతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఖాన్ల త్రయంలో ఒకడిగా అసాధారణ ఎత్తులకు ఎదిగిన అమీర్ హీరోయిజానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. అయితే ఆయన వ్యక్తిగత ఇమేజ్.. సక్సెస్ రేటు ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారసులకు మాత్రం ఏమాత్రం కలిసి రావడం లేదు. అమీర్ ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన నట వారసత్వం ఇండస్ట్రీలో చతికిలబడటం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
మొదట అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే.. అతడి కెరీర్ `జానే తూ యా జానే నా` వంటి భారీ హిట్ చిత్రంతో అత్యంత ఘనంగా మొదలైంది. ఒకానొక దశలో చాక్లెట్ బాయ్‌గా కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడం.. దానికి తోడు వ్యక్తిగత జీవితంలో భార్యతో ఏర్పడిన విభేదాలు అతడిని మానసికంగా కుంగదీశాయి. వెండితెరపై తన ముద్ర వేయలేక.. రకరకాల కారణాలతో ఇమ్రాన్ ఖాన్ అనతి కాలంలోనే పరిశ్రమకు దూరమై `బ్యాక్ బెంచీ`కి పరిమితమయ్యాడు.
మేనల్లుడి పరిస్థితిని చూసిన అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ (రీనా దత్తా కుమారుడు) కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. జునైద్‌ను వెండితెరకు పరిచయం చేసే క్రమంలో కథల ఎంపికలో అమీర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మహారాజ్ అనే చిత్రంతో తొలి ప్రయత్నం ఓకే అనిపించినా కానీ.. ఆ తర్వాత జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ తో కలిసి `లవ్ యాపా` అనే ప్రేమకథా చిత్రంలో జునైద్ నటించాడు. అయితే ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవ్వకపోగా.. విమర్శకులు.. సామాన్య ప్రేక్షకులు సైతం జునైద్ నటనపై పెదవి విరిచారు.
ఆరంభ సినిమాలతో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మూడో సినిమాతోనైనా తన కొడుకు నిలదొక్కుకుంటాడని అమీర్ ఖాన్ భావించారు. ఇందుకోసం `లక్కీ ఛామ్`గా పేరున్న టాలెంటెడ్ నటి సాయి పల్లవిని జునైద్ సరసన ఎంపిక చేసి `ఏక్ దిన్` అనే సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. కానీ ఈ సినిమా కూడా జునైద్ ఖాన్‌ను ఆదుకోలేకపోయింది. సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంతో పాటు.. అమీర్ ఖాన్ తన కుమారుడి కోసం చేసిన ప్రమోషన్స్ .. ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమీర్ ఖాన్ వంటి లెజెండరీ నటుడి అండదండలు ఉన్నా.. ప్రేక్షకులు జునైద్ ఖాన్‌ను తిరస్కరించడానికి గల కారణాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. నటనలో పరిణతి లేకపోవడమా లేక ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ హంగులు జునైద్‌లో లోపించాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా రెండు చిత్రాలు నిరాశపరచడంతో.. జునైద్ ఖాన్ హీరోగా పరిశ్రమలో మనుగడ సాగించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ ఇమేజ్ వారసత్వాన్ని మోసుకొస్తుంది కానీ, సక్సెస్‌ను కాదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.
స్టార్ హీరోల వారసులు కేవలం తండ్రి పేరుతో లేదా అగ్ర నటీమణుల పక్కన నటించడం వల్ల ప్రేక్షకుల మనసు గెలవలేరని స్వయంకృషితో పట్టుదలగా ప్రయత్నించి నిజమైన హీరోలు అని నిరూపించాలని విశ్లేషిస్తున్నారు.