న‌టి విడాకులు ద్విలింగ సంపర్కం వెనుక అస‌లు నిజం!

బుల్లితెర నటి ఆకాంక్ష చమోలా ఇటీవలి సంచలన వ్యాఖ్యలు వినోద పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Update: 2026-08-28 02:54 GMT

బుల్లితెర నటి ఆకాంక్ష చమోలా ఇటీవలి సంచలన వ్యాఖ్యలు వినోద పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నటుడు గౌరవ్ ఖన్నాతో వివాహమైన కొన్ని ఏళ్ల తర్వాత.. తాను విడాకులు తీసుకోబోతున్నానని ప్రకటిస్తూనే.. తాను `బైసె*క్సువల్` (ద్విలింగ సంపర్కురాలు) అనే విషయాన్ని బయటపెట్టారు. అయితే విడాకులకు కేవలం త‌న‌ లైంగిక ధోరణి మాత్రమే కారణం కాదని.. పిల్లలను కనడంపై ఇద్దరి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు (కుటుంబ ప్రణాళిక) కూడా ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గౌరవ్‌కు పిల్లలు కావాలని ఉండగా.. తనకు ఆ ఆసక్తి లేదని.. అలాగే స్త్రీలపై ఉండే ఆకర్షణ .. లైంగిక ధోరణులు మారుతుండటం వల్ల విడాకులు తీసుకోక తప్పడం లేదని ఓ రియాలిటీ షోలో ఓపెన్‌గా వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను ద్వ‌లింగ సంప‌ర్కురాలు అని తెలిసే త‌న‌ను స‌హ‌న‌టుడు పెళ్లాడిన విష‌యాన్ని ఆకాంక్ష గుర్తు చేసారు.

ఆకాంక్ష చమోలా కెరీర్ జర్నీని పరిశీలిస్తే..ఎం.కామ్ పూర్తయిన తర్వాత నటనపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2015లో ప్రసారమైన పాపుల‌ర్ సీరియల్ `స్వరాగిణి`లో పరిణీత పాత్రతో మొదటిసారిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత భూతు, భాగ్యలక్ష్మి, కైసే ముఝే తుమ్ మిల్ గయే వంటి హిట్ సీరియ‌ళ్ల‌లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సీరియళ్లతో పాటు క్రైమ్ పెట్రోల్, యే హై ఆషికి వంటి షోలలో నటించి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెడితే... పెళ్లి తర్వాత లైంగిక ధోరణి గురించి లేదా బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించడం అంత తేలికైన విషయం కాదు. సమాజంలో ఇటువంటి అంశాలపై ఇంకా అనేక అపోహలు, విమర్శలు ఉన్నా ఆకాంక్ష చాలా ధైర్యంగా నిజాయితీగా బయటపెట్టారు. ప్రస్తుతం తన జీవితంలోని ఒక కొత్త దశలో ఉన్నానని.. విడాకుల నిర్ణయం తర్వాత తాను ఏ సెక్సువల్ (శారీరక ఆకర్షణ లేని స్థితి) దశను అనుభవిస్తున్నానని కూడా మీడియాకు నిర్మొహమాటంగా చెప్పారు.

రంగుల ప్రపంచంలో తమ లైంగిక ధోరణిని (ఎల్‌.జి.బి.టి.క్యూ+) బహిరంగంగా అంగీకరించిన ప్రముఖులు కొందరు ఉన్నారు. నటి విశాఖ సింగ్, ద్యుతీ చంద్ (అథ్లెట్), ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ వీజే బానీ వంటివారు ఈ జాబితాలో నిలుస్తారు. అయితే హిందీ బుల్లితెర రంగంలో ఒక ప్రముఖ వివాహిత నటి తాను బైసెక్సువల్ అని, ద్విలింగ‌ ఆకర్షణ ఉందని ఇంత ధైర్యంగా చెప్పిన మొదటి వ్య‌క్తి ఆకాంక్ష చ‌మోలి.

ఒకరి వ్యక్తిగత లైంగికత లేదా కుటుంబ నిర్ణయాల ఆధారంగా వారిని తీర్పు చెప్పడం సరైన పద్ధతి కాదు. సమాజంలో ఎంతమంది విమర్శించినా.. తన మనస్సాక్షికి అనుగుణంగా నిజాయితీగా జీవించడానికే ఆకాంక్ష చమోలా ప్రాధాన్యతనిచ్చారు. ఈ ధైర్యమైన నిర్ణయాన్ని త‌న‌ అభిమానులు, నెటిజన్లు కొందరు సమర్థిస్తుండగా.. గౌరవ్ ఖన్నా - ఆకాంక్ష ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News