2026 అక్కినేని నామ సంవత్సరం గ్యారెంటీ..!
2025 సంవత్సరంలో అక్కినేని ఫ్యాన్స్‌కి ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వలేదు. ఈ ఏడాదిలో వచ్చిన నాగ చైతన్య తండేల్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.;
2025 సంవత్సరంలో అక్కినేని ఫ్యాన్స్‌కి ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వలేదు. ఈ ఏడాదిలో వచ్చిన నాగ చైతన్య తండేల్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాల్లోనూ హీరోగా నటించలేదు. ధనుష్ హీరోగా నటించిన కుభేర సినిమాలో ముఖ్య పాత్రలో నటించగా, రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. కుబేర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగ్ పాత్ర విషయంలో అసంతృప్తి వ్యక్తం అయింది. ఇక కూలీ సినిమాలో నాగ్ పాత్ర విమర్శలు ఎదుర్కొంది. లుక్ పరంగా బాగానే ఉన్నా పాత్ర డిజైన్ బాగాలేదు అంటూ రివ్యూలు వచ్చాయి. అందుకే ఈ ఏడాదిలో నాగ్ సినిమాలు వచ్చినా హీరోగా రానందుకు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక చినబాబు అఖిల్ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర పడే రోజు రాబోతుంది.
అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూపులు...
ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కి అటు ఇటు అయినప్పటికీ రాబోయే 2026 మాత్రం కచ్చితంగా వారికి డబుల్ ధమాకా అన్నట్లుగా ఉండబోతుంది. ఇప్పటికే నాగార్జున 100వ సినిమా పట్టాలెక్కింది. అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది అంటున్నారు. ఆ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. నాగ్ వందవ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమాను రూపొందిస్తున్నారు. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమాను ఆశిస్తున్నారో అలాంటి మంచి సినిమా అంటూ అక్కినేని కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. సంక్రాంతికి అధికారికంగా సినిమాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
నాగార్జున 100వ సినిమా లాటరీ కింగ్
ఇక అఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా లెనిన్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చొరవ ఉందనే వార్తలు వస్తున్నాయి. మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి నాగవంశీ ఇటీవల స్పందిస్తూ చాలా బాగా సినిమా వస్తుందని అన్నాడు. నాగార్జున గారు ప్రతి విషయాన్ని బూతద్దం పెట్టుకుని మరీ చూస్తున్నారు. కనుక లెనిన్ సినిమా తమ బ్యానర్ కి 2026 లో పెద్ద హిట్ ను ఇవ్వడం ఖాయం అని అన్నాడు. లెనిన్ సినిమా లో అఖిల్ ప్రజెన్స్ బాగుంటుందని, అఖిల్ కి ఇది ఒక రీ లాంచ్ లా ఉంటుంది అని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఇక మీదట అఖిల్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా లెనిన్ భారీ విజయంతో దూసుకు పోతుంది అనే అభిప్రాయంను అక్కినేని ఫ్యాన్స్ సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
లెనిన్, వృషకర్మ సినిమాలపై అంచనాలు..
ఇక నాగ చైతన్య హీరోగా 2026 లోనూ ఒక హిట్ సినిమాతో రాబోతున్నాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. విభిన్న చిత్రాల దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సినిమా రూపొందుతోంది. వృషకర్మ అనే విభిన్న టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నిర్మాణంతో పాటు, రైటింగ్‌లోనూ సుకుమార్ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు అక్కినేని హీరోలు నమోదు చేయని నెంబర్స్ 2026 లో నమోదు కాబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. అక్కినేని హీరోల లైనప్ 2026 లోనే కాకుండా రాబోయే రోజుల్లోనూ కొనసాగాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకే ఏడాది ముగ్గురు అక్కినేని హీరోలు వంద కోట్లు అంతకు మించి వసూళ్లు సాధిస్తే అంతకు మించిన ఆనందం ఫ్యాన్స్‌కి ఏం ఉంటుంది. అది మరి 2026 లో జరగబోతుందా అంటే గ్యారెంటీగా జరుగుతుంది అని కొందరు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.