నీతులు చెప్పే బీజేపీలో నేర‌స్తులు.. దేశంలో ఎంత మంది ఉన్నారంటే!

నేరాల‌పై ఉక్కుపాదం మోపుతాం.. అక్ర‌మాల‌ను అణిచేస్తాం.. అని ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే చెబుతున్నారు.

Update: 2023-07-16 04:16 GMT

నేరాల‌పై ఉక్కుపాదం మోపుతాం.. అక్ర‌మాల‌ను అణిచేస్తాం.. అని ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీలోనే నేర‌స్తులు ఎక్కువగా ఉన్నార‌ని తాజాగా అసిసోయేష‌న్ ఆఫ్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్‌(ఏడీఆర్‌) స‌ర్వే తేల్చి చెప్పింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ త‌ర‌ఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు మొత్తం 1420 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 1356 మంది కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల‌ అఫిడ‌విట్ల‌లో త‌మ నేరాల‌ను కూడా వెల్ల‌డించారు. మిగిలిన‌వారు వెల్ల‌డించ‌లేదు.

ఇలా.. అఫిడ‌విట్ల‌లో నేరాల‌ను వెల్ల‌డించిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 473 ఉంది. అంటే దాదాపు 40 శాతం. అంతేకాదు.. దేశంలోనే అత్యంత నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న పార్టీల్లో బీజేపీ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇక‌, ఎమ్మెల్యే ప‌రంగా చూసుకుంటే.. హ‌త్యా నేరాలు స‌హా దోపిడీ, బెదిరింపులు వంటి తీవ్ర నేరాలు ఎదుర్కొంటున్న వారు 337 మంది ఉన్నారు. దీంతో దేశంలోనే అత్యంత నేర చ‌రిత్ర ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన క‌మ‌ల నాథులు ఈ రిపోర్టు త‌ర్వాత‌.. ఏం చేస్తారో చూడాలి.

ఇదిలావుంటే.. ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే మూడో స్తానంలో ఉండ‌డం విశేషం. ఆయా పార్టీల్లోనూ కీల‌క‌మైన కేసుల్లో నేర‌స్తులుగా ఉన్న‌వారు ఉండ‌డం గ‌మ‌నార్హం. అధికారుల‌పై దౌర్జ‌న్యాలుస‌హా.. కిడ్నాపులు, మాన‌భంగాల వంటి కేసులు ఎదుర్కొంటున్న‌వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డీఎంకేలోనూ హత్యా నేరాలు ఎదుర్కొంటున్న‌వారు ఉన్నారు. చిత్రం ఏంటంటే చ‌దువుల్లో ఫ‌స్ట్ ఉన్న కేర‌ళ నేర చ‌రిత్ర ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే 1వ స్థానంలో ఉంది. కేర‌ళ‌లో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వీరిలో 94 మంది ఎమ్మెల్యేల‌పై హ‌త్య‌, అత్యాచారాలు, మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా వంటి కేసులు ఉన్నాయ‌ని వారు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లోనే పేర్కొన్న‌ట్టు ఏడీఆర్ వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News