అంధ విశ్వాసానికి 3.50 కోట్లు మాయం..
శాస్త్రసాంకేతికత, వైద్య పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తుంటే.. ఏదో ఒక మూల అంధ విశ్వాసంతో చీకటి కోణాలు దాన్ని కమ్మేస్తుంది.;
శాస్త్రసాంకేతికత, వైద్య పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తుంటే.. ఏదో ఒక మూల అంధ విశ్వాసంతో చీకటి కోణాలు దాన్ని కమ్మేస్తుంది. భయానికో రంగు, భయానికో రూపం ఇచ్చి.. దేవుడు వస్తాడు, క్షుద్రపూజలకు రోగాలు పారిపోతాయి, నిధి ఉంది బలివ్వాలి, ఇలాంటి మాటలు అమాయకుల జీవనాన్ని మరింత అగాథంలోకి నెడుతుంటాయి. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని ఒక నకిలీ గురువు.. ఏకంగా రూ.3.50 కోట్లు కొల్లగొట్టడం సామాన్య మోసం కాదు ఇది సామాజిక వైఫల్యం, పోలీసు వ్యవస్థపై నమ్మకం పోవడం, అంధ విశ్వాసం ఇంకా ఎంత బలంగా విస్తరించి ఉందన్నదానికి బలమైన ఉదాహరణ.
క్షుద్రపూజల పేరిట రూ.3.50 కోట్ల దోపిడీ..
వనపర్తి జిల్లా, పెబ్బేరు ప్రాంతంలో నివసిస్తున్న వెంకటయ్య–పద్మ దంపతులు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మనిషైనా ఒక మంచి మాట కోసం, ఒక ఆశ కోసం చూస్తాడు.. అలాంటి దశలోనే బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గాసింగ్ అనే వ్యక్తి గురించి వారికి తెలిసింది. ‘అతడికి దేవుడు వస్తాడట.. అతని వద్ద పూజ చేయిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందట.’ అన్న ఒక్క మాటే వారి జీవితాన్ని తారుమారు చేసింది. వారు దుర్గాసింగ్ వద్దకు రాగానే కథ రక్తికట్టించాడు. మీ పొలంలో నిధి ఉంది.. అది బయటకు రాకపోతే మీ కుటుంబానికి ప్రాణహాని ఉంది.. క్షుద్రశక్తులు అడ్డుపడుతున్నాయి, అందుకే మీరు ఆరోగ్యం బాగుండడం లేదు.. లాంటి ఒకటి కాదు, పది కథలు చెప్పి దంపతులలో భయం నింపాడు. మొదటి విడతగా రూ.80 లక్షలు తీసుకున్నాడు.
ఇక్కడితో ఆగలేదు. దంపతుల పొలంలో ‘క్షుద్రపూజలు’ చేసి, అక్కడ మూడడుగుల ఎత్తున్న ‘విగ్రహం బయటపడింది’ అని చూపించాడు. దాన్ని ఇంట్లో పెట్టుకున్నా ప్రమాదమే, అమ్మేస్తే కోట్ల రూపాయలు వస్తాయని ఉచ్చులో వేశాడు. విదేశాల నుంచి కొనుగోలుదారులు వచ్చినట్లు నమ్మబలికి, ఐదు సార్లు ఢిల్లీకి తీసుకెళ్లి.. మొత్తంగా రూ.3.50 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. చివరకు దంపతులకు నిజం అర్థమైంది ఇది అంతా ఒక నాటకం. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే, గ్రామంలోకి అడుగు పెడితే చంపేస్తాం అంటూ దుర్గాసింగ్, ముకుంద బెదిరింపులు మొదలు పెట్టారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా..
దంపతులు పెబ్బేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోలేదు.
తర్వాత ఆధోనికి వెళ్లి డీఎస్పీ, సీఐలకు వివరాలు చెప్పారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. చివరకు ఎమ్మెల్యే పార్థసారథి ప్రజాదర్బార్ వరకు వచ్చి తమ గోడును వినిపించాల్సిన దుస్థితి. డీఎస్పీ మాత్రం సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు నమోదు చేయలేదు అన్నారు. ఒక ప్రశ్న ఇక్కడ స్వయంగా వినిపిస్తోంది.. రూ.3.50 కోట్లు మాయం అవుతుంటే, ఐదు సార్లు ఢిల్లీకి వెళ్తున్న పేద దంపతులు కనిపిస్తుంటే, వారి బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఉంటే.. ఇవన్నీ సాక్ష్యాలు కావా?
అంధ విశ్వాసం ఎందుకు ఇంత బలంగా ఉంది?
ఈ ఘటన మన సమాజంలో ఉన్న నిజాన్ని మళ్లీ గుర్తు చేసింది. భయం ఉన్న చోట మోసం పుడుతుందని, నమ్మకం ఉన్న చోట దోపిడీ జరుగుతుందని, అవసరం ఉన్న చోట నకిలీ గురువులు జన్మిస్తారని, ఆరోగ్యం, కుటుంబ భద్రత, భవిష్యత్తుపై భయం ఉంది అంటూ చెప్పే వారి మాటల్లో మాయాజాలం ఉంటుంది. వెంకటయ్య–పద్మ దంపతులు మోసపోయింది వారి అమాయకత్వం వల్ల కాదు.. మన వ్యవస్థ, మన సమాజం, మన చట్ట అమలు లోపం వల్ల.