ఐబొమ్మ రవికి మించిన ముదుర్లు అతడి ఫ్రెండ్స్?

సంచలనంగా మారిన ఐబొమ్మ రవి ఉదంతానికి సంబంధించి పోలీసులు రెండు దఫాలుగా నిర్వహించిన విచారణలోని కొన్ని అంశాలు తాజాగా వెలుగు చూశాయి.;

Update: 2025-12-02 05:25 GMT

సంచలనంగా మారిన ఐబొమ్మ రవి ఉదంతానికి సంబంధించి పోలీసులు రెండు దఫాలుగా నిర్వహించిన విచారణలోని కొన్ని అంశాలు తాజాగా వెలుగు చూశాయి. పోలీసులకు ముప్పతిప్పలు పెట్టి.. చివరకు దొరికిపోయిన ఐబొమ్మ రవి సంగతి తెలిసిందే. తాను ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు చిక్కనన్న ధీమాతో అతడి అత్యుత్సాహం అతడ్ని పట్టించిందని చెబుతున్నారు. ఐబొమ్మ రవికి తగ్గట్లే.. అతడికి అన్ని విధాలుగా సాయం చేస్తూ.. అండగా నిలిచిన అతని ఇద్దరు ఫ్రెండ్స్ మహా ముదుర్లుగా చెబుతున్నారు.

ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం అతడికి అత్యంత సన్నిహితులైన ప్రసాద్.. ప్రహ్లాద్ కుమార్ లను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. అయినప్పటికి వారి ఆచూకీ ఇప్పటివరకు లభించని పరిస్థితి. పోలీసులు ఎంతలా ట్రాక్ చేసినా.. వారి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పోలీసుల విచారణలో వెల్లడించిన కొన్ని అంవాలకు సంబంధించి ఐబొమ్మ రవి ఇచ్చిన స్పష్టతకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూస్తున్నాయి.

అమీర్ పేటలో కంప్యూటర్ కోర్సులు చేసే రోజుల్లోనే రవి తన ఐడెంటిలీని రహస్యంగా ఉంచేవాడని చెబుతున్నారు. ఐదారు నెలలకు ఒకసారి హాస్టల్ మారేవాడని గుర్తించారు. 2020లో ప్రహ్లాద్ కుమార్.. ప్రసాద్ ను స్నేహితులుగా పేర్కొంటూ సప్లయిస్ ఇండియా.. హాస్పిటల్స్ డాట్ ఇన్ పేరుతో రెండు కంపెనీలు షురూ చేశారు. వీరి వివరాలతోనే ఆధార్.. పాన్ కార్డులు.. డిజైన్ సంతకాలు రూపొందించారు. దాదాపు 35కు పైనే డొమైన్లు నిర్వహిస్తున్నారు.

ఐబొమ్మ.. బప్పం టీవీ వెబ్ సైట్లను ప్రారంభించిన తర్వాత తాను ఎవరన్న విషయం బయటకు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఫ్రెండ్స్ ఐడెంటిటీతో డొమైన్లు కొనుగోలు చేసి.. అందుకు తగ్గట్లే బ్యాంక్ లావాదేవీల్ని నిర్వహించారు. తాను సంపాదించిన డబ్బుపై ప్రతి నెలా రూ.2 లక్షల వరకు రవికి ఆదాయం వచ్చేదని.. ఆ డబ్బులతో తరచూ విదేశాలకు వెళ్లి వచ్చేవాడన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రవికి అండగా నిలిచిన ఇద్దరు స్నేహితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ఎంతలా పరయత్నిస్తున్నా.. వారి ఆచూకీ మాత్రం దొరకపోవటం చూస్తే.. ఐబొమ్మ రవికి మించిన ముదురుకేసులుగా పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News