2026లో అరుదైన ఖగోళ విశేషం: 13 నెలలు.. అధిక జ్యేష్ఠ మాసం!
ఈ అధిక మాసం కారణంగా సాధారణంగా ఉండే 12 నెలలకు బదులుగా.. 2026లో తెలుగు క్యాలెండర్ ప్రకారం మొత్తం 13 నెలలు ఉండనున్నాయి.;
సాధారణంగా హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం 12 నెలలు మాత్రమే ఉంటాయి. చైత్ర మాసంతో ప్రారంభమై, ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. అయితే చంద్రమానం తెలుగు క్యాలెండర్, సౌరమానం ఆంగ్ల క్యాలెండర్ మధ్య సమతుల్యత కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం లేదా మల మాసం అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా అధిక మాసం వచ్చినప్పుడు, ఆ సంవత్సరంలో 13 నెలలు ఉంటాయి.హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన 'అధిక మాసం' 2026 సంవత్సరంలో రాబోతోంది. ఈ అధిక మాసం కారణంగా సాధారణంగా ఉండే 12 నెలలకు బదులుగా.. 2026లో తెలుగు క్యాలెండర్ ప్రకారం మొత్తం 13 నెలలు ఉండనున్నాయి. ఈ విశేషాన్ని 'పరాభవ' నామ సంవత్సరంలో రాబోయే అధిక జ్యేష్ఠ మాసంగా పండితులు నిర్ధారించారు.
ఎందుకు వస్తుంది అధిక మాసం?
సాధారణంగా హిందూ క్యాలెండర్ చంద్రమానం (చంద్రుని గమనం) ఆధారంగా లెక్కించబడుతుంది, ఆంగ్ల క్యాలెండర్ సౌరమానం సూర్యుని గమనం ఆధారంగా లెక్కించబడుతుంది. ఈ రెండు పద్ధతులను సమతుల్యం చేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చంద్రమానంలో ఒక నెల అదనంగా వస్తుంది. దీనినే అధిక మాసం లేదా మల మాసం అని పిలుస్తారు.
* జ్యేష్ఠ మాసంలోనే ఎందుకు?
2026లో కొత్త తెలుగు పంచాంగం మార్చి 30న ప్రారంభం కానుంది. ఈ సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు. చైత్రం, వైశాఖం తర్వాత వచ్చే మూడవ నెల జ్యేష్ఠ మాసం కావడం విశేషం. ఈసారి అధిక మాసంగా ఇదే నెల రాబోతోంది. గతంలో అధిక ఆషాఢం, అధిక శ్రావణం వంటి మాసాలు వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాసం మే 17, 2026 నుంచి జూన్ 15, 2026 వరకూ.. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16, 2026 – జూలై 14, 2026 వరకూ ఉంటుంది. అధిక మాసం ముగిసిన తర్వాతే అసలైన (నిజ) జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది.
* అధిక మాసంలో చేయదగినవి
గతంలో అధిక ఆషాఢంలో శుభకార్యాలు నిలిపివేసేవారు. అయితే, అధిక జ్యేష్ఠం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం పుణ్యకార్యాలకు అనుకూలమైన మాసం అని తెలిపారు. "అధిక జ్యేష్ఠ మాసంలో నిరభ్యంతరంగా పూజలు, వ్రతాలు, దానాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసం విష్ణువు ఆరాధనకు అత్యంత అనుకూలమైంది. ఈ నెలలో విష్ణువును ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి" అని ప్రముఖ పండితులు సూచించారు.
*పండుగలు, శుభకార్యాలపై ప్రభావం
అధిక మాసం కారణంగా పండుగల తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పండుగలు కొత్త పంచాంగం ప్రకారం నిర్ణయించిన నిజ మాసంలోనే నిర్వహించబడతాయి. అయినప్పటికీ, వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభ ముహూర్తాల విషయంలో మాత్రం స్థానిక పండితులు, జ్యోతిష్యులను సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ముందుకు వెళ్లాలని వారు ప్రజలకు సూచించారు.