వైసీపీలో సిక్కోలు మేయర్ గుబులు !
| శ్రీకాకుళం సహా వాయిదా పడిన నాలుగు కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 10-12 మధ్య నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 25 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్‌ఈసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మేయర్ పీఠంపై రాజకీయ ఆసక్తి పెరిగింది. గుండ లక్ష్మీదేవి కుటుంబం వైసీపీ నుంచి బరిలో దిగే అవకాశం ఉండగా, టీడీపీ-జనసేన కూటమి కూడా పీఠంపై ఆశలు పెట్టుకుంది.
శ్రీకాకుళం నగర పాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఏపీలో నాలుగు కార్పోరేషన్ల ఎన్నికలు న్యాయ పరమైన అవరోధాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులో రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లి- మంగళగిరి కూడా ఉన్నాయి. పొరుగు గ్రామాలను విలీనం చేయడం, వార్డుల డీలిమిటేషన్ రిజర్వేషన్లు కోర్టు కేసుల కారణంగా గతంలో నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం హైకోర్టులో ఈ న్యాయ పరమైన వివాదాలు పరిష్కారం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మిగిలిపోయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అలా నవంబర్ 10 నుండి 12 మధ్యలో ఈ నాలుగు కార్పోరేషన్లతో పాటు వాయిదా పడిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని నవంబర్ 25 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్‌ఈసీ భావిస్తోందని చెబుతున్నారు.
కూటమి ఫుల్ జోష్ లో :
ఇక మున్సిపల్ ఎన్నికల్లో స్వీప్ చేసి పరిషత్తు ఎన్నికల్లో జోరు చూపించిన కూటమి ఫుల్ జోష్ లో ఉంది. దాంతో అదే వేడిలో ఈ మిగిలిన స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టాలని చూస్తోంది. అదే కనుక జరిగితే తొందరలోనే వీటికి ఎన్నికల నగరా మోగుతుంది. అయితే శ్రీకాకుళం విషయం తీసుకుంటే తొలిసారి కార్పొరేషన్ అయింది. పైగా గడచిన పదిహేనేళ్ళుగా పాలక వర్గం అన్నది లేదు. దాంతో ఎప్పుడు ఎన్నికలు పెడతారా పదవులు అందుకుందామా అని రాజకీయ నేతలు చూస్తున్నారు. కూటమిలో అయితే ఆ తొందర మరీ ఎక్కువగా ఉంది. వైసీపీ విషయం తీసుకుంటే స్థానిక ఎన్నికలు మొదలు కాక ముందు ఉన్న ధీమా అయితే ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. దానికి కారణం ఫలితాలలో వైసీపీ పూర్తిగా చతికిల పడడమే అని అంటున్నారు.
గుండ కుటుంబానికి :
టీడీపీలో నాలుగు దశాబ్దాలకు పైగా ఉంటూ వచ్చిన గుండ కుటుంబం వైసీపీలో చేరింది. దానికి కారణం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి మేయర్ టికెట్ ఇవ్వలేదని, పైగా ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోయింది అని. దాంతో తమకు భవిష్యత్తు లేదని భావించి గుండ ఫ్యామిలీ మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయింది. అయితే గుండ ఫ్యామిలీకి మేయర్ పదవి ఇస్తామని వైసీపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. అన్ని ఖర్చులు పెట్టుకుంటామని స్థానిక వైసీపీ పెద్దలు కూడా భరోసా ఇచ్చారని టాక్ నడిచింది. ఇపుడు చూస్తే కూటమి ప్రభంజనం వీస్తోంది. దీంతో గుండ కుటుంబం వచ్చి చేరినా మేయర్ పీఠం ఎలా దక్కుంచుకోగలమని వైసీపీలో కొత్త గుబులు రేగుతోంది అని అంటున్నారు.
టీడీపీకి పట్టు :
ఇక శ్రీకాకుళం పట్టణం టీడీపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతం. 1983 నుంచి చూస్తే ఇప్పటిదాక అత్యధిక సార్లు ఆ పార్టీయే గెలిచింది. పైగా జనసేన కూడా ఇపుడు కలుస్తోంది. దాంతో కూటమిగా వస్తే కనుక అధికార బలం తోడు అయి సిక్కోలు తొలి పీఠం జనసేనదే అవుతుంది అన్నది ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. దాంతో గతంలో వేసుకున్న అంచనాలు తప్పుతూండడం, అలాగే ఫలితాలు తేడా కొడుతూండడంతో వైసీపీలో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు. ఇక గుండ కుటుంబానికి రాజకీయ లక్ ఏ మేరకు ఉంది అన్నది కూడా సిక్కోలు మేయర్ ఎన్నికలు రుజువు చేయబోతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.