Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి రవిశంకర్ ఔట్.. వరుణ్ గాంధీ, సింధియా ఇన్?

By:  Tupaki Desk   |   22 Jun 2021 10:36 AM GMT
కేంద్రమంత్రి రవిశంకర్ ఔట్.. వరుణ్ గాంధీ, సింధియా ఇన్?
X
దేశ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ పై పార్టీలోనూ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. కరోనా వేవ్ తర్వాత మోడీ ప్రభ తగ్గిందని స్వయంగా సర్వేలు చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలోనే నష్ట నివారణ చర్యల దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ లాంటి బలమైన చోట్ల బీజేపీ చతికిలపడింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కేంద్రకేబినెట్ లో మార్పులు చేయబోతున్నట్టు తెలిసింది. ఆ రాష్ట్రాలకు కేంద్రమంత్రి పదవుల్లో పెద్దపీట వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలోని కొంత మంది సీనియర్లకు, స్తానచలనం ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా కొంతమందిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టుగా కేంద్రం నుంచి సమాచారం అందుతోంది.

కేంద్రమంత్రివర్గంలోకి అస్సాంకు చెందిన సర్వానంద్ బిస్వాల్, బీహార్ కు చెందిన సుశీల్ కుమార్ మోడీ, వరుణ్ గాంధీ, జ్యోతిరాదిత్యసింధియా, అనుప్రియా పటేల్ వంటి వారికి కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.కొంతమందిని కేంద్రమంత్రులుగా తప్పించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ను పక్కకు తప్పించి తమిళనాడు గవర్నర్ గా నియమించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో రవిశంకర్ ప్రసాద్ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు న్యాయసలహాదారుడిగా పనిచేశారు. ఆ రాష్ట్రంలోని నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రవిశంకర్ కు గవర్నర్ పదవిని అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి.