Begin typing your search above and press return to search.

హ‌రీష్ రావు మాట‌లు మ‌న‌సులోంచే వ‌చ్చాయా?

By:  Tupaki Desk   |   17 Jun 2021 1:30 AM GMT
హ‌రీష్ రావు మాట‌లు మ‌న‌సులోంచే వ‌చ్చాయా?
X
హ‌రీష్ రావు - ఈట‌ల బంధం ఈ నాటిది కాదు. టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఉద్య‌మంలో వీరు క‌లిసిమెలిసే ఉన్నారు. అంతేకాదు.. కేసీఆర్ త‌ర్వాత ఉద్య‌మాన్ని బ‌లంగా ముందుకు న‌డిపించిన వారిలో వీరిద్ద‌రూ ఉంటారు. ఆ విధంగా ఏళ్ల త‌ర‌బ‌డి క‌లిసే న‌డిచారు. అదే స‌మయంలో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రో పోలిక కూడా ఉంది. టీఆర్ఎస్ లో ఇద్ద‌రూ ఒకే ర‌క‌మైన నిరాధ‌ర‌ణ‌కు గురయ్యార‌నే ప్ర‌చారం మొన్న‌టి వ‌ర‌కూ గ‌ట్టిగానే జ‌రిగింది.

ఎప్పుడైతే కేటీఆర్ ను అంద‌లం ఎక్కించాల‌ని కేసీఆర్ భావించారో.. అప్ప‌టి నుంచి క్ర‌మంగా హ‌రీశ్‌రావును ప‌క్క‌న పెడుతూ వ‌చ్చార‌నే ప్ర‌చారం బహిరంగంగానే సాగింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అప్ప‌గించ‌డం నుంచి.. ప్ర‌ధాన ఎన్నిక‌ల్లో బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వ‌ర‌కు.. అన్ని విష‌యాల్లోనూ కేటీఆర్ ను ముందు నిలుపుతూ వ‌చ్చారు గులాబీ అధినేత‌. పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ హ‌రీశ్ ప్రాధాన్యత‌ను క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిస్తూ వ‌చ్చార‌ని గులాబీ శ్రేణులే గుస‌గుస‌లాడే ప‌రిస్థితి. టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టిన ఏడాది నుంచే ఈ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇన్నేళ్ల కాలంలో క్ర‌మంగా అంద‌రూ అల‌వాటు ప‌డిపోయారు. సైలెంట్ అయ్యారు.

ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ తో మ‌ళ్లీ హ‌రీశ్ రావు అంశం కూడా తెర‌పైకి వ‌చ్చింది. అంతేకాదు.. ఈట‌ల నేరుగా హ‌రీశ్ రావు అంశాన్ని ప్ర‌స్తావించ‌డం హాట్ టాపిక్ గా మారింది. మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్ తోపాటు రెండో సారి కూడా హ‌రీశ్ ను లాగారు ఈట‌ల‌. దీంతో.. కౌంట‌ర్ ఇచ్చిన హ‌రీశ్‌.. ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తాను చెడ్డకోతి వ‌న‌మంతా చెరిచిన చందంగా.. ఈట‌ల తీరు ఉంద‌ని, ఆయ‌న భావ‌దారిద్ర్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. అంతేకాదు.. తాను జీవితాంతం కేసీఆర్ వెంటే ఉంటాన‌ని అన్నాడు. ఆయ‌న మాట జ‌వ‌దాట‌బోన‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే.. ఈ మాట‌లు నిజంగా హ‌రీశ్ మ‌న‌సులోనుంచి వ‌చ్చిన‌వి కాదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టీఆర్ఎస్ లో ఉన్నారు కాబ‌ట్టి.. ఈట‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోతే బాగుండ‌ద‌ని టీఆర్ఎస్ అధిష్టానం చేసిన సూచ‌న మేర‌కే అలా వ్యాఖ్యానించార‌ని ఈట‌ల వ‌ర్గీయులు అభిప్రాయ ప‌డుతున్నారు. హ‌రీశ్ ను కేసీఆర్ టార్గెట్ చేసింది నిజం కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈట‌ల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఎంత ఉందో.. హ‌రీశ్ చేసిన వ్యాఖ్య‌ల్లోనూ నిజం అంతే ఉంద‌ని అంటున్నారు.