ఆ థియేటర్ దర్శకధీరుడికి తరగతి గది లాంటిది!
20 సంవత్సరాల కెరీర్ జర్నీ ఈ థియేటర్ తో పాటుగా సాగిందని వెల్లడించారు.
By: Tupaki Desk | 28 July 2023 3:50 AM GMT'స్టూడెంట్ నంబర్ 1' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన రాజమౌళి (2001) నేడ పాన్ (ఇండియా) వరల్డ్ డైరెక్టర్ గా సంచలనాలు సృష్టిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ సహా ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో అతడు తన స్థాయి హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గదు అని నిరూపించాడు.
అయితే ఎంత పెద్ద దర్శకుడు అయినా అంత గొప్పవాడు అవ్వడం వెనక అతడి స్టడీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దర్శకధీరుడు కె.రాఘవేంద్రరావు శిష్యుడిగా ఆయన చాలా నేర్చుకున్నా తన స్టడీ అంతా థియేటర్లలోనే కొనసాగిందని ఎంతో నిజాయితీగా చెబుతున్నారు రాజమౌళి.
తాజాగా తన ట్విట్టర్ లో ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులకు షేర్ చేసారు. తాను హైదరాబాద్‌లోని మొదటి మల్టీప్లెక్స్ థియేటర్ అయిన ప్రసాద్ ఐమాక్స్ నిర్మాణం జరిగే సమయంలో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 20 సంవత్సరాల కెరీర్ జర్నీ ఈ థియేటర్ తో పాటుగా సాగిందని వెల్లడించారు. అంతేకాదు ప్రసాద్స్ ఐమ్యాక్స్ థియేటర్‌తో తనకు ఉన్న మధురమైన జ్ఞాపకాల గురించి ఇప్పుడు ప్రస్థావించారు.
థియేటర్‌ని తన అతిపెద్ద అభ్యాస ప్రదేశంగా పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రసాద్స్ IMAX కి తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఎందుకంటే దర్శకుడిగా తనకు పాఠాలు నేర్పించింది ఈ థియేటరే. ఇందులో మొదటి రోజు మొదటి షోలకు హాజరు కావడం నుండి సినిమాలో ఏం ఉందో ఆస్వాధించే వరకూ.. ఐమ్యాక్స్ తనకు ఒక తరగతి గది లాంటిది అని తెలిపాడు. ఈ థియేటర్ లోనే కెరీర్ మొత్తంలో విలువైన పాఠాలు నేర్చుకున్నాడట. జక్కన్న మాటల్లో నిజాయితీపై నెటిజనులు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాల్ని ఆవిష్కరించే ఐమ్యాక్స్ అంటే సినీవీక్షకులకు ప్రత్యేక అభిమానం. ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ఎంతో ప్రత్యేకమైనది. .మల్టీప్లెక్స్ లో ఆరవ ఆడిటోరియంలో 101.6 అడుగుల వెడల్పు 64 అడుగుల పొడవైన స్క్రీన్ ఉంటుంది. కెనడాకు చెందిన ప్రొజెక్షన్ స్క్రీన్ కంపెనీ Strong MDI దీనిని రూపొందించింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన స్క్రీన్ QSC ఆడియో తో క్వాలిటీ స్పీకర్లను కలిగి ఉంది. ఫీచర్లలో డాల్బీ CP950 సౌండ్ ప్రాసెసర్ .. హై-ఎండ్ డిజిటల్ ప్రొజెక్షన్ కూడా ఉన్నాయి. ఈ కొత్త స్క్రీన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అలాగే ఐమ్యాక్స్ లో పీసీఎక్స్ స్క్రీన్ గురించి ఇటీవల విస్త్రతంగా చర్చ సాగింది. పిసిఎక్స్ అనుభవం ఎంతో గొప్పగా ఉందని కొందరు ప్రశంసించగా కొందరికి ఇది అలవాటయ్యేందుకు సమయం పట్టిందని చెబుతున్నారు.
ఐమ్యాక్స్ 20 ఏళ్ల ప్రస్థానం ఐనాక్స్ - పీవీఆర్ సినిమాస్-ఏషియన్ సినిమాస్- బిగ్ సినిమాస్.. ఇలా ఎన్నో మల్టీప్లెక్సులు ఉన్నా ప్రసాద్స్ ఐమ్యక్స్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇక్కడ ప్రజల సందడి కి హద్దు ఉండదు. ఒకేచోట థియేటర్లు షాపింగుకి అనువైన స్థలంగా ఇది పాపులరైంది. నగరానికి తలమానికం అయిన హిస్టారికల్ ప్లేస్ లో ఐమ్యాక్స్ నిర్మాణం జరగడంతో ఇక్కడ రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే రిలీజ్ డే సందడికి కూడా ఐమ్యాక్స్ ఎంతో ప్రసిద్ధి చెందింది.
సినిమాల సమీక్షకులంతా (యూట్యూబ్- ఈమీడియా) ఐమ్యాక్స్ లో సినిమా చూసి అదే ప్రదేశంలో రివ్యూలు చెబుతుంటే అక్కడ బోలెడంత సందడి నెలకొంటుంది. నగరంలో ఏఎంబీ సినిమాస్.. ఏఏఏ సినిమాస్ ఇటీవల కొత్తగా ప్రారంభమైనవి. కానీ ఇప్పటికీ ఐమ్యాక్స్ కి ఉండే క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఇక ఐమ్యాక్స్ 20 వసంతాలు పూర్తి చేసుకుని తన క్రేజ్ ని ఎప్పటిలానే నిలుపుకోవడం ఆసక్తికరం.