టూరిస్టులను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన స్థానికుడు.. కొడుకు త్యాగానికి గర్వపడుతున్న తండ్రి!
ఆదిల్ తండ్రి హైదర్ షా, తన కొడుకు చేసిన సాహసం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
By: Tupaki Desk | 25 April 2025 8:30 AMజమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో టూరిస్టులను కాపాడే ప్రయత్నంలో ఒక స్థానికుడు, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు చేసిన సాహసం గురించి ఆయన తండ్రి హైదర్ షా మాట్లాడుతూ.. "నా కొడుకు చేసిన త్యాగానికి నేను గర్వపడుతున్నాను. ఆ గర్వమే నన్ను బతికిస్తోంది. లేకపోతే, నా చిన్న కొడుకు శవాన్ని చూడగానే నేను చనిపోయేవాడిని. వాడు చూపించిన ధైర్యానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాడి వల్ల కొందరి ప్రాణాలు నిలబడ్డాయి. దానికి నేను గర్వపడుతున్నాను." అని చెప్పారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో అనేకమంది అమాయక టూరిస్టులతో పాటు, వారిని కాపాడే ప్రయత్నంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుడైన ఆదిల్, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు.
ఆదిల్ తండ్రి హైదర్ షా, తన కొడుకు చేసిన సాహసం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆదిల్ సాహసం గురించి స్థానికులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఆదిల్ చాలా మంచివాడు. ఎప్పుడూ అందరికీ సహాయం చేసేవాడు. టూరిస్టులను కాపాడే ప్రయత్నంలో వాడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం" అని ఒక స్థానికుడు తెలిపాడు.
పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్ చేసిన త్యాగం దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. సామాన్యుడైన ఆదిల్ ప్రాణాలకు తెగించి టూరిస్టులను కాపాడే ప్రయాత్నం చేయడం ఆయన ధైర్యానికి నిదర్శనం. ఆదిల్ చేసిన త్యాగానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది.