Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో.. రాజస్థాన్‌ లో మరో దారుణం!

దేశంలో మణిపూర్‌ అయినా, ఛత్తీస్‌ గఢ్‌ అయినా, రాజస్థాన్‌ అయినా.. ఇలా రాష్ట్రం ఏదయినా మహిళలపై హింస ఆగడం లేదు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 5:13 AM GMT
వైరల్‌ వీడియో.. రాజస్థాన్‌ లో మరో దారుణం!
X

దేశంలో మణిపూర్‌ అయినా, ఛత్తీస్‌ గఢ్‌ అయినా, రాజస్థాన్‌ అయినా.. ఇలా రాష్ట్రం ఏదయినా మహిళలపై హింస ఆగడం లేదు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తెస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీని తాలూకూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక మహిళను ఒక వ్యక్తి తన కారు బానెట్‌ పై 500 మీటర్లు దూరం ఈడ్చుకుపోవడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ లోని హనుమాన్‌ గఢ్‌ మెయిన్‌ బస్టాండ్‌ సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌ పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

సీసీ టీవీ దృశ్యాల ప్రకారం.. జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు రాంగ్‌ రూటులో వచ్చింది. ఇంతలో ఓ యువతి ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో కారు తోలుతున్న వ్యక్తి కారును ఆపకుండా పోనిచ్చేయడంతో ఆ యువతి కారు పైకి పడింది. దీంతో ఆమె కింద పడిపోకుండా సేఫ్టీగా బానెట్‌ ను పట్టుకుంది. అయితే డ్రైవర్‌ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. ఇలా 500 మీటర్ల దూరం ఆమెను ఈడ్చుకుపోయాడు. ఇది చూసిన స్థానికులు ఆమెను కాపాడటానికి కారు వెంట పరుగులు తీశారు. అయినా ఆ వ్యక్తి కారును ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ౖవైరల్‌ అయ్యింది. ఈ వీడియో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ ఘటనలో కారును గుర్తించామని జంక్షన్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ విష్ణు ఖత్రి చెప్పారు. సీసీ టీవీలో రికార్డైన విజువల్స్‌ ఆధారంగా ఇది రావ్లాకు చెందిన వ్యక్తి కారుగా గుర్తించామన్నారు. మహిళ, కారు డ్రైవర్‌ కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. మరోవైపు తమకు ఇప్పటివరకు బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్‌ చేశారు. ఈ దారుణ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘రాజస్థాన్‌ లోని హనుమాన్‌ఘఢ్‌ లో పట్టపగలు ఓ మహిళను కారు బానెట్‌ పై ఈడ్చుకుపోతున్నారు. గెహ్లాట్‌ జీ.. మీ పరిపాలనలో మహిళలపై ప్రతిరోజు ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్న విషయం మీకు తెలుస్తోందా?’ అని రాథోడ్‌ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.