Begin typing your search above and press return to search.

రోడ్డు పక్క టెంట్ నుంచి.. 5 కోట్ల ఫ్లాట్ కు టీమిండియా క్రికెటర్

జైశ్వాల్ ఇంగ్లండ్ తో సిరీస్ లో మూడు టెస్టుల్లోనే 545 పరుగులు చేశాడు. మరో రెండు టెస్టులు ఉన్న నేపథ్యంలో అతడు 700పైగా పరుగులు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 1:30 PM GMT
రోడ్డు పక్క టెంట్ నుంచి.. 5 కోట్ల ఫ్లాట్ కు టీమిండియా క్రికెటర్
X

దేశంలో ప్రస్తుతం ఆ క్రికెటర్ పేరు మార్మోగుతున్నది.. ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశం అవుతోంది.. ఎక్కడినుంచి ఎక్కడికి అతడి ప్రస్థానం..? అనే ఆసక్తికర సంవాదం నడుస్తోంది.. ఎక్కడి ఉత్తరప్రదేశ్..? ఎక్కడి ముంబై..? వేలాది కిలోమీటర్ల దూరం.. కానీ, క్రికెట్ పై ఉన్న అమిత ఇష్టమే ఓ పదేళ్ల బాలుడిని నడిపించింది. ఇల్లు విడిచేలా చేసింది. అలా మహా నగరానికి చేరుకున్న అతడికి.. నా అనే వారు ఎవరూ లేనిచోట ఉండేందుకు చోటు ఎక్కడ దొరుకుతుంది..? అందుకే ఓ టెంట్ లో తలదాచుకున్నాడు. అదిరిపోయే ముంబై ఎండల్లో.. కనీసం బాత్ రూమ్ సౌకర్యం లేని.. నీటి సదుపాయం లేని టెంట్ లో ఉంటూ వచ్చాడు. టెంట్ యజమాని చేత తిట్లు తిన్నాడు.. తన్నులు తిన్నాడు.. అన్నీ భరిస్తూ దగ్గర్లోని ఆజాద్ మైదానానికి వెళ్లి అక్కడివారు ఎలా ఆడుతున్నారో చూసేవాడు.. క్రమంగా తానూ బ్యాట్ పట్టాడు. కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నాడు.

పైన చెప్పినదంతా టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ గురించి. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదిన జైశ్వాల్ ఇప్పుడు ఎక్కడచూసినా హాట్ టాపిక్. దీనికిముందు గత జూలైలో టీమిండియాలోకి వచ్చిన అతడు వెస్టిండీస్ తో తొలి టెస్టులోనే భారీ సెంచరీ కొట్టాడు. వీటన్నికి ముందే జైశ్వాల్ గురించి రకరకాల కథనాలు వచ్చాయి. ఇప్పుడు డబుల్ డబుల్ సెంచరీలతో మరింతగా చర్చనీయాంశం అవుతున్నాడు అతడు.

ఐసీసీ ర్యాంకుల్లోనూ జోష్

జైశ్వాల్ ఇంగ్లండ్ తో సిరీస్ లో మూడు టెస్టుల్లోనే 545 పరుగులు చేశాడు. మరో రెండు టెస్టులు ఉన్న నేపథ్యంలో అతడు 700పైగా పరుగులు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రికార్డులు బద్దలే. ఇంగ్లండ్ పై ప్రదర్శనతో ఇప్పుడు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకుల్లో టాప్-20లోకి వచ్చాడు. దీంతో అతడికి చెందిన ప్రతి విషయమూ వైరల్ అవుతోంది. జైశ్వాల్ ఓ ఇంటిని కొనడం కూడా ఇలానే సంచలనం రేపుతోంది.

ముంబై బాంద్రాలో..

జైశ్వాల్ ముంబైలో అత్యంత ఖరీదైన ముంబై మహా నగరంలోని బాంద్రా ప్రాంతంలో ఫ్లాట్‌ కొన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ప్రకారం.. జైశ్వాల్

ఈస్ట్‌ బాంద్రా వింగ్‌ 3 ఏరియాలోని 1,100 చదరపు అడుగుల ఫ్లాట్ కొన్నట్లు తెలిసింది. దీని విలువను రూ. 5.4 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ముంబైలో బాంద్రా అంటే సముద్ర తీరంలోకి చొచ్చుకుని ఉండే ప్రాంతం. కాగా, క్రికెటర్ కావాలన్న కలను తీర్చుకోవడానికి జైశ్వాల్ చాలా కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఒంటరిగా ముంబై వచ్చిన అతడు కొన్నాళ్లు టెంట్‌ లో గడిపాడు. జైశ్వాల్ క్రికెట్‌ శిక్షణ కోసం వెళ్తూ పానీ పూరి బండి వద్ద పనిచేసినట్లుగూ కథనాలు వచ్చాయి. కాగా, ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్‌ లెవల్‌ లో సత్తా చూపిన జైశ్వాల్.. అండర్ -19 వరల్డ్‌ కప్‌ లో రాణించాడు. ఐపీఎల్‌ లో అడుగుపెట్టాడు. రూ.2.4 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్ అతడిని తీసుకుంది. గత సీజన్ లో 14 మ్యాచుల్లో 625 పరుగులు చేశాడు.