Begin typing your search above and press return to search.

డబ్ల్యూటీసీ ఫైనల్: 113 ఏళ్లకు లార్డ్స్ లో ఆసీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2023-25 సైకిల్ ముగింపునకు వచ్చింది. బుధవారం నుంచి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 7:00 PM IST
డబ్ల్యూటీసీ ఫైనల్: 113 ఏళ్లకు లార్డ్స్ లో ఆసీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్
X

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2023-25 సైకిల్ ముగింపునకు వచ్చింది. బుధవారం నుంచి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రఖ్యాత మైదానం, క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ లోని లార్డ్స్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. దీంతో టెస్టుల్లో ప్రపంచ చాంపియన్ గా నిలిచి గద అందుకునేది ఎవరో తేలిపోనుంది. 2019-21, 2021-23 డబ్ల్యూటీసీ సైకిల్స్ లో ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా ఈసారి పోటీలో లేకపోవడం భారతీయ అభిమానులకు లోటుగా మిగిలింది. తొలిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమ్ ఇండియా రన్నరప్ తో సరిపెట్టుకుంది.

బుధవారం నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. విశేషం ఏమంటే.. ఈ రెండు జట్లు లార్డ్స్ తలపడి 113 ఏళ్లయింది. చివరగా 1912లో ముక్కోణపు సిరీస్ లో ఆసీస్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. నాడు మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా 10 వికెట్లతో ఓడించింది.

ఇక ఇప్పటి విషయానికి వస్తే ప్యాటి కమ్మిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా, టెంబా బవుమా కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా బుధవారం నుంచి ఫైనల్లో ఢీకొననున్నాయి. బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఓడిపోకపోవడం గమనార్హం. 9 మ్యాచ్ లలో కెప్టెన్సీ చేసిన అతడు 8 మ్యాచ్ లలో జట్టును గెలిపించాడు. ఒక టెస్టు డ్రా అయింది. అంటే బవుమా సారథ్యంలోని అజేయ దక్షిణాఫ్రికా.. కంగారూలను ఎదుర్కొనేందుకు సిద్ధం అయింది అన్నమాట.

బలాబలాపరంగా చూస్తే రెండు జట్లు గట్టివే. హెడ్, స్మిత్, లబుషేన్ లతో కూడిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు రబడ, పీటర్సన్, ఎంగిడిలతో కూడిన దక్షిణాఫ్రికా బౌలింగ్ గట్టి సమరమే జరగనుంది.