Begin typing your search above and press return to search.

4 టెస్టులు గెలిచారు.. 4 చోట్ల టాపర్ గా నిలిచారు

అంటే క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ మనమే నంబర్ వన్.

By:  Tupaki Desk   |   10 March 2024 12:58 PM GMT
4 టెస్టులు గెలిచారు.. 4 చోట్ల టాపర్ గా నిలిచారు
X

ప్రత్యర్థి బజ్ బాల్ అంటూ బంతిని చితక్కొట్టే రకం.. సిరీస్ చూస్తే ఐదు మ్యాచ్ లు.. స్టార్ బ్యాటర్ దూరమయ్యాడు.. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు.. దీంతోపాటు తొలి టెస్టులో ఓటమి.. వికెట్ కీపర్ నిరాశపరిచాడు.. కెప్టెన్ ఫామ్ గొప్పగా లేదు.. మిగతా బ్యాటర్లంతా కుర్రాళ్లు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టయినా సొంత గడ్డపై ఆడినా గెలుపు కష్టమే.. కానీ టీమిండియా అద్భుతం చేసింది.

టీమ్ స్పిరిట్ తో ఆడి..

ప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం.. యువ ఓపెనర్ జైశ్వాల్ ఆత్మవిశ్వాసం.. కుర్ర శుబ్ మన్ గిల్ నిలకడ.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మెరుపులు, పేసర్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులు, అశ్విన్, కుల్దీప్, జడేజా స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ పై టీమిండియా టెస్టు సిరీస్ ను 4-1 తేడాతో గెలిచింది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్ తొలుత ఆధిక్యం కనబరిచినా చివరకు ఓటమిని మూటగట్టుకుంది. దీంతో విశాఖ పట్టణంలో జరిగిన రెండో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి ఎదుర్కొంది. ఆ పరిస్థితిని ఛేదించుకుని వచ్చి మిగతా నాలుగు టెస్టులనూ అలవోకగా నెగ్గింది.

విశాఖలో మొదలుపెట్టి..

సముద్ర తీరాన ఉండే విశాఖ పట్టణంలో మొదలైన భారత్ జైత్రయాత్ర హిమాలయాల చెంతన ఉండే ధర్మశాల లో ముగిసింది. విశాఖ, రాజ్‌ కోట్, రాంచీ, ధర్మశాల ఇలా వేదిక ఏదైనా విజయం మనదే అయింది. సిరీస్ ను 4-1 తో కొట్టేయడంతో ఐసీసీ ర్యాంకుల్లోకి దూసుకెళ్లింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 122 పాయింట్లతో టాప్‌ లో ఉంది. ఆస్ట్రేలియా (117)ది రెండో స్థానం. అయితే, భారత్‌ చేతిలో సిరీస్‌ కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్‌ (111) మాత్రం మూడో స్థానంలోనే ఉంది. న్యూజిలాండ్‌ (101), దక్షిణాఫ్రికా (99) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ తో ఆస్ర్టేలియా ప్రస్తుతం రెండో టెస్టు ఆడుతోంది. ఇందులో గెలుపు ఓటములు ర్యాంకులను ప్రభావితం చేయవు.

వన్డేలు, టి20లు..

వన్డేలు, టీ20ల్లోనూ భారత్‌ టాప్‌ ర్యాంక్ లో ఉంది. అంటే క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ మనమే నంబర్ వన్. ఇదేకాక.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ పాయింట్ల పట్టికలోనూ మొదటి స్థానం (68.56 శాతం)లో ఉంది. న్యూజిలాండ్‌ (60), ఆసీస్ (59.09) మన తర్వాత 2, 3 ర్యాంకుల్లో నిలిచాయి. టెస్టు ర్యాంక్‌ తో కలిపి నాలుగింట్లోనూ భారత్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. కాగా, వన్డేల్లో భారత్ (121), ప్రపచం చాంపియన్ ఆస్ట్రేలియా (118), దక్షిణాఫ్రికా (110), పాకిస్థాన్ (109), న్యూజిలాండ్‌ (102) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. టి20 ఫార్మాట్‌ లో భారత్ (266) తర్వాత మిగతా నాలుగు స్థానాలు ఇంగ్లాండ్ (256), ఆస్ట్రేలియా (255), న్యూజిలాండ్ (254), పాకిస్థాన్ (249)వి.