Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ లో ఆ బ్యాటర్ 1000 పరుగులు కొట్టేస్తాడేమో..?

25 ఏళ్ల వయసులో.. 2018-21 మధ్య కాలంలో మూడు ఫార్మాట్లలోనూ దక్షిణాఫ్రికా కు కెప్టెన్ పనిచేసిన అతడు ఆ బాధ్యతలను అలాగే వదిలేశాడు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:09 AM GMT
ప్రపంచ కప్ లో ఆ బ్యాటర్ 1000 పరుగులు కొట్టేస్తాడేమో..?
X

ఆడింది ఐదు మ్యాచ్ లు.. అందులో మూడు సెంచరీలు.. ఒకటి భారీ శతకం.. ఇప్పటికే 400 పరుగులు దాటేశాడు. మరో నాలుగు లీగ్ మ్యాచ్ లు ప్లస్ సెమీఫైనల్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ కు కూడా చేరితే ఆరు మ్యాచ్ లు అవుతాయి. అతడి జోరు చూస్తుంటే, ఈ ప్రపంచ కప్ లో ఏకంగా వెయ్యి పరుగులు చేసేస్తాడా? అన్న అనుమానం కలుగుతోంది. ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తూ.. మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు కొడుతూ దూసుకెళ్తున్న ఆ బ్యాట్స్ మన్ తమ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు.

దూకుడుకు మారు పేరు

408.. ప్రపంచ కప్ లో ఇప్పటికే దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చేసిన పరుగులు. ఐదు మ్యాచ్ లకే 400 దాటేశాడు. దీన్ని చూసే డికాక్ వెయ్యి పరుగులు బాదేస్తాడేమో? అనే అంచనాలు పెరుగుతున్నాయి. నెదర్లాండ్స్ పై 20 పరుగులకు, ఇంగ్లండ్ పై 4 పరుగులకు ఔటయ్యాడు డికాక్. లేదంటే 500 కు చేరువ అయ్యేవాడేమో? సరే.. ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీనో, అర్ధ సెంచరీనో చేస్తాడు అనుకోవడం సరికాదు. కానీ, డికాక్ ఫామ్ చూస్తుంటే మాత్రం కనీసం 50 పరుగులైనా కొట్టేలా ఉన్నాడు. దూకుడుకు మారుపేరైన ఈ లెఫ్ట్ హ్యాండర్ అటు వికెట్ కీపర్ పాత్ర పోషిస్తూనే.. ఇటు ఓపెనర్ బరిలో దిగి దుమ్మరేపుతున్నాడు.

వెలుగులోకి వచ్చింది మనపైనే..

30 ఏళ్ల డికాక్ అంతర్జాతీయ వన్డే కెరీర్ 2013 మొదట్లో మొదలైంది. ఆ ఏడాది చివర్లో భారత్ తో జరిగిన సిరీస్ లో వరుసగా మూడు సెంచరీలు కొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆ సిరీస్.. దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ అని కాకుండా.. డికాక్ వర్సెస్ భారత్ అని జరిగిందని చెప్పొచ్చు. అప్పటినుంచి డికాక్ వెనుదిరిగి చూసుకోలేదు. మూడు ఫార్మాట్లలోనూ దక్షిణాఫ్రికాకు కీలక ఆటగాడిగా మారాడు. 15 వన్డేలు ఆడి 6,500 పైగా పరుగులు చేశాడు. 54 టెస్టుల్లో 3300 పరుగులు బాదాడు. 80 టి20ల్లో 2277 పరుగులు కొట్టాడు.

కెరీర్ పై ఆశ్చర్యకర నిర్ణయాలు..

అద్భుత బ్యాట్స్ మన్ అయిన డికాక్ కు కెరీర్ విషయంలో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంటాడనే పేరుంది. 25 ఏళ్ల వయసులో.. 2018-21 మధ్య కాలంలో మూడు ఫార్మాట్లలోనూ దక్షిణాఫ్రికా కు కెప్టెన్ పనిచేసిన అతడు ఆ బాధ్యతలను అలాగే వదిలేశాడు. ప్రస్తుతం అతడికి 30 ఏళ్లు నిండబోతున్నాయి. ఏ విధంగా చూసినా మరో ఐదారేళ్ల కెరీర్ ఖాయం. కానీ, ఈ ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై చెబుతానని ప్రకటించాడు. విచిత్రం ఏమంటే.. 2021 చివర్లో భారత్ తో సిరీస్ సందర్భంగా టెస్టులకు వీడ్కోలు పలికాడు డికాక్. ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు ఆడడం ద్వారా వచ్చే డబ్బు కోసమే వన్డేల నుంచి తప్పుకొంటున్నానని కూడా అతడు ప్రకటించాడు. దీంతోపాటు కుటుంబానికి కొంత సమయం కేటాయించేందుకూ వన్డే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

మన ముంబై ఇండియనే

డికాక్ ఐపీఎల్ లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నాడు. ఓపెనర్ గా రోహిత్ శర్మతో కలిసి క్రీజులోకి దిగుతున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్ డెవిల్స్), సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకూ ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ముంబైకి ఆడడం ద్వారానే మంచి పేరుతెచ్చుకున్నాడు.