Begin typing your search above and press return to search.

తిలక్ వర్మ.. ఎడమచేతివాటం సూర్యకుమార్

అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో అర్థ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 9:36 AM GMT
తిలక్ వర్మ.. ఎడమచేతివాటం సూర్యకుమార్
X

హైదరాబాదీ తిలక్ వర్మ టీమిండియాలో పాతుకుపోయేలా కనిపిస్తున్నాడు. ఈ యువ బ్యాటర్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సహచరులు విఫలమవుతున్నా నిలకడ చూపుతున్నాడు. వెస్టిండీస్‌ తో ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్ లో తిలక్ ఆటనే హైలైట్. ఈ సిరీస్ తోనే అరంగేట్రం చేసిన తిలక్ మీద పెద్దగా అంచనాలు లేవు.

సాధారణ స్థాయిలో రాణిస్తాడులే అనుకున్నారు. కానీ.. అంచనాలను మించి ఆడుతున్నాడు. రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా టాప్ స్కోరర్ అతడే కావడం గమనార్హం. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్‌.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌ లో కెరీర్‌ లో తొలి అర్ధ సెంచరీ (51)ని అందుకున్నాడు.

జట్టు ఓడినా అతడు గెలిచాడు వెస్టిండీస్ తో టెస్టు, వన్డే సిరీస్ లను అలవోకగా గెలిచిన టీమిండియా టి20ల్లో తడబడుతోంది. రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ ల్లో టార్గెట్ ను ఛేదించలేక, కాపాడుకోలేకపోయింది.

కానీ, రెండు మ్యాచ్ ల్లోనూ తిలక్ ఇన్నింగ్స్ లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో తిలక్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో అర్థ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఈ ఘనతను అతడు 20 ఏళ్ల 271 రోజుల వయసులో అందుకున్నాడు. విశేషం ఏమంటే చిన్న వయసులో టి20ల్లో అర్థ సెంచరీ చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. అతడు 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో దీనిని సాధించాడు. 2007టి ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై రోహిత్ 50 పరుగులు చేశాడు. మరో విశేషం ఏమంటే తిలక్ తన తొలి అర్ధ సెంచరీని రోహిత్ కూతురు సమైరాకు అంకితం ఇచ్చాడు.

లెప్ట్ హ్యాండ్ సూర్యలా..

వెస్టిండీస్ తో సిరీస్ లో యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తడబడుతున్నాడు. అనుభవం ఉన్న సంజూ శాంసన్ విఫలమవుతున్నాడు. 360 డిగ్రీ సూర్య కుమార్ యాదవ్ లో పదును తగ్గిందా? అనిపిస్తోంది. ఇదే సమయంలో ఎడమచేతి వాటం సూర్యకుమార్ యాదవ్ లా ఆడుతున్నాడు తిలక్ వర్మ.

ఆదివారం మ్యాచ్ లో అతడు ఆడిన స్కూప్ షాట్ కానీ.. లాంగాఫ్ దిశగా బాదిన సిక్సర్ కాని దీనినే చెబుతున్నాయి. తొలి టి20లోనూ తిలక్ కొట్టిన షాట్లు ఔరా అనిపించాయి. అతడి దూకుడు కూడా సూర్య స్థాయిలోనే ఉండడం విశేషం.

అతడు ఔటైంది భారీ షాట్ ఆడబోయే. కాస్త సరిగ్గా కనెక్ట్ అయి ఉంటే ఆ షాట్ సిక్స్ వెళ్లేది. 20 ఏళ్ల తిలక్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగులు వేస్తున్నాడు. ఇదే ఒరవడిని కొనసాగిస్తే అతడికి మరింత మంచి భవిష్యత్ ఖాయం.