Begin typing your search above and press return to search.

ఈ కెప్టెన్ల పని ప్రపంచ కప్ తో ఖతం

వైఫల్యానికి బాధ్యతగా కొందరు సారథులు బాధ్యతలను వదిలేస్తారు. మరికొందరిని వారి బోర్డులే తప్పిస్తాయి. ఇలా పదవిని కోల్పోయేవారు ఎవరా? అని చూస్తే..

By:  Tupaki Desk   |   12 Nov 2023 10:50 AM GMT
ఈ కెప్టెన్ల పని ప్రపంచ కప్ తో ఖతం
X

భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ సెమీస్ దశకు వచ్చేసింది. వాస్తవానికి ఆదివారం భారత్- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ చివరి లీగ్ మ్యాచ్. బుధవారం మొదటి సెమీస్ భారత్-న్యూజిలాండ్ మధ్యన ముంబైలో జరగనుంది. అయితే, భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నామమాత్రమే కావడంతో సెమీఫైనల్స్ దశకు వచ్చినట్లుగానే భావించాలి. అయితే, ఎవరెంత బాగా ఆడినా, సెమీఫైనల్ కు చేరేది నాలుగు జట్లే. కొన్ని జట్లు మాత్రం అంచనాలను అందుకోలేక సెమీస్ కు దూరమయ్యాయి. అలాంటివాటిలో పాకిస్థాన్, ఇంగ్లండ్ లను ముఖ్యంగా పేర్కొనాలి.

అనూహ్యం లేదు కానీ,

ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ కు చేరతాయని అంచనా వేశారు. ఆస్ట్రేలియా ఎప్పుడూ ఫేవరెట్ అయినా,ఎందుకనో ఈసారి సెమీస్ చేరుతుందని ఎక్కువమంది భావించలేదు. ఇక దక్షిణాఫ్రికాను కూడా పెద్దగా పరిగణించలేదు. కానీ, ఈ రెండు జట్లూ సెమీస్ చేరాయి. పాకిస్థాన్ పడుతూ లేస్తూ సాగగా, ఇంగ్లండ్ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. అయితే, గెలుపోటములు సమానమే అయినా.. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో జట్టును నడిపించడంలో కెప్టెన్ల పాత్రను చూస్తారు. వైఫల్యానికి బాధ్యతగా కొందరు సారథులు బాధ్యతలను వదిలేస్తారు. మరికొందరిని వారి బోర్డులే తప్పిస్తాయి. ఇలా పదవిని కోల్పోయేవారు ఎవరా? అని చూస్తే..

బట్లర్ బరాబర్ ఔట్

చాంపియన్ గా ప్రపంచ కప్ లో అడుగుపెట్టిన ఇంగ్లండ్.. చరిత్రలో ఏ డిఫెండింగ్ చాంపియనూ ఆడనంత ఘోరంగా ఆడింది. 9 మ్యాచ్ లకు గాను మూడు మాత్రమే గెలిచి, టేబుల్ లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. సెమీస్ రేసు నుంచి చాలా ముందే ఔటైంది ఆ జట్టు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పై వేటు కత్తి వేలాడుతోంది. బట్లర్ కెప్టెన్ గానే కాదు బ్యాట్స్ మన్ గానూ దారుణంగా విఫలమయ్యాడు. విధ్వంసక బ్యాట్స్ మన్ అయిన బట్లర్.. ఈ కప్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదంటే ఎంతగా విఫలమయ్యాడో తెలుస్తుంది. కప్ ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చేసిన 43 పరుగులే బట్లర్ అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీంతో ప్రపంచ కప్ అనతరం బట్లర్ ను తప్పించడం గ్యారెంటీ అనే వాదన వస్తోంది.

బాబర్ ఉంటాడా?

దాయాది పాకిస్థాన్ కూడా ప్రపంచ కప్ లో బాగా ఆడలేదు. కెప్టెన్ బాబర్ సైతం ఆకట్టుకోలేదు. 9 లీగ్ మ్యాచ్ లలో ఒక్క సెంచరీ కూడా లేదు. నాలుగు అర్ధ సెంచరీలు సాధించినా.. కీలక సమయంలో విఫలమై జట్టును గెలిపించలేకపోయాడు. అయితే, పాకిస్థాన్ అంటేనే పైరవీలు. తుది జట్టు ఎంపికలోనూ బోర్డు, సెలక్టర్ల పెత్తనం ఉంటుంది. మేటి బ్యాట్స్ మన్ ఇంజమాముల్ హక్ మేనల్లుడు ఇమాముల్ హక్ విఫలం అవుతున్నా.. కొనసాగించడం ఇలాంటిదే అనుకోవాలి. కాగా, బాబర్ పాక్ నంబర్ వన్ బ్యాట్స్ మనే కాదు.. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మన్. అతడిని తప్పిస్తే కెప్టెన్ స్థాయి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ రిజ్వాన్ కే ఉంది. కానీ, కీపింగ్, బ్యాటింగ్ బాధ్యతలకు తోడు కెప్టెన్సీ కూడా అప్పగిస్తే ఆ ప్రభావంతో అతడు విఫలమైతే మరింత ఇబ్బందికరం. ఇప్పటికైతే బాబర్ కెప్టెన్సీ పదిలమని చెప్పలేం. తొలగిస్తారనీ చెప్పలేం.

బవుమా.. భారమా?

మేటి బ్యాట్స్ మెన్, మెరుగైన బౌలర్లు ఉన్న దక్షిణాఫ్రికాకు భారం ఎవరంటే.. కెప్టెన్ బవుమా. కెప్టెన్ కాకుంటే అతడు తుది జట్టులోకి అనర్హుడు. సగటు బ్యాట్స్ మన్ అయిన బవుమా.. దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్. కానీ, ప్రపంచ కప్ లో అతడి ప్రదర్శన సాధారణం. బవుమా కోసం మంచి ఫామ్ లో ఉన్న హెండ్రిక్స్ ను పక్కనపెట్టాల్సి వస్తోంది. అయితే, దక్షిణాఫ్రికా తుది జట్టులో కనీసం నలుగురు నల్లజాతీయులు ఉండాలన్న కోటా నిబంధన బవుమాపై వేటుకు అడ్డంకిగా నిలుస్తున్నదని భావించవచ్చు. ఆటలో, ప్రవర్తనలో వివాదాస్పదుడైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ నూ తొలగించవచ్చు. 37 ఏళ్ల షకిబ్ ను తొలగించి మరొకరికి అవకాశం ఇచ్చే ఆలోచన చేయొచ్చు. కాగా, శ్రీలంక కెప్టెన్ షనాక గాయంతో ప్రపంచ కప్ నుంచి మధ్యలో తప్పుకొన్నాడు. మంచి ఆల్ రౌండర్ అయిన షనాక కెప్టెన్సీకి ముప్పేమీ లేదు. అయితే, లంక క్రికెట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేస్తే.. లంక సభ్యత్వాన్నే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రద్దు చేసింది. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి