Begin typing your search above and press return to search.

అప్పట్లో కాంబ్లీ.. ఇప్పుడు ఇతడు.. అంతా సేమ్ టు సేమ్

ఆస్ట్రేలియాకు ఒక డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ కు అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికాకు గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ కు స్టీఫెన్ ఫ్లెమింగ్, పాకిస్థాన్ కు సయీద్ అన్వర్ వంటి వారు గొప్ప ఎడమచేతివాటం ఆటగాళ్లుగా మిగిలిపోయారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 7:31 AM GMT
అప్పట్లో కాంబ్లీ.. ఇప్పుడు ఇతడు.. అంతా సేమ్ టు సేమ్
X

భారత క్రికెట్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కాస్త తక్కువే. అందులోనూ సుదీర్ఘ కాలం ఆడినవారు మరీ తక్కువ. ఆస్ట్రేలియాకు ఒక డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ కు అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికాకు గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ కు స్టీఫెన్ ఫ్లెమింగ్, పాకిస్థాన్ కు సయీద్ అన్వర్ వంటి వారు గొప్ప ఎడమచేతివాటం ఆటగాళ్లుగా మిగిలిపోయారు. అయితే, భారత్ కు వచ్చేసరికి అతి తక్కువ మంది ఈస్థాయిలో రాణించారు. వారిలో ముఖ్యుడు సౌరభ్ గంగూలీ. కెప్టెన్ గా, వన్డేల్లో ఓపెనర్ గా గంగూలీ భారత క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్. అయితే, యువరాజ్ టెస్టుల్లో పెద్దగా రాణించలేదు. కొన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆడినా.. సుదీర్ఘకాలం నిలవలేదు. గంభీర్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. అందులోనూ యువరాజ్, గంగూలీ టెస్టుల్లో ఓపెనర్లు కాదు. యువీ ఏ ఫార్మాట్ లోనూ ఓపెనర్ కాదు. గంభీర్ మాత్రం మూడు ఫార్మాట్లలోనూ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. టి20, వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఓ దశలో కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. నిలకడ తప్పడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ధావన్ మొదట్లో టెస్టులు బాగానే ఆడినా తర్వాత వన్డేలు, టి20లకే పరిమితం అయ్యాడు. అయితే, వీరందరి కంటే ముందు టీమిండియాలో ఓ లెఫ్ హ్యాండర్ గురించి పెద్ద చర్చ జరిగింది.


అతడు నిలిచి ఉంటే..

తక్కువ చేయడం కాదు.. కానీ.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కంటే మేటి బ్యాట్స్ మన్ గా పేరుతెచ్చుకున్నాడు అతడి చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లీ. కుడి-ఎడమ కాంబినేషన్ లో ముంబై స్కూల్ క్రికెట్ లో వీరిద్దరూ సంచనాలు రేపారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు జాతీయ జట్టులోకి వచ్చారు. సచిన్ కంటే ముందే టెస్టు క్రికెట్ లో కాంబ్లీకి మంచి సక్సెస్ వచ్చింది. సచిన్ కంటే మూడేళ్లు ఆలస్యంగా టెస్టు కెరీర్ మొదలుపెట్టినా.. మొదటి 7 టెస్టుల్లోనే అతడు నాలుగు (రెండు డబుల్ సెంచరీలు సహా) సెంచరీలు కొట్టాడు. ఇందులో ఇంగ్లండ్ పై ఒకటి చేశాడు. అయితే, ఇవే అతడికి టెస్టుల్లో చివరి సెంచరీలు. క్రమశిక్షణ లోపంతో టీమిండియాకు దూరమయ్యాడు. తిరిగి వచ్చాక కూడా రాణించకపోవడంతో అంతర్జాతీయ కెరీర్ మొత్తానికే ముగిసింది. సరిగ్గా కాంబ్లీ జట్టుకు దూరమైన సందర్భంలోనే వెలుగులోకి వచ్చాడు సౌరభ్ గంగూలీ. అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చకుని ఎదిగిపోయాడు. అయితే, టెస్టుల్లో కాంబ్లీ తరహాలో టాప్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడగల బ్యాట్స్ మన్ కోసం టీమిండియా మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది. ఆ నిరీక్షణకు తెరదించుతూ దూసుకొచ్చాడు యశస్వి జైశ్వాల్.

దుమ్మురేపుతున్నాడు కుర్రాడు..

యువ ఓపెనర్ జైశ్వాల్ విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ కొటాడు. కెరీర్‌లో అతడికి ఇది తొలి డబుల్ సెంచరీ. 179 పరుగులతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన యశస్వి.. శనివారం ఉదయం ప్రత్యర్థి బౌలర్లపై ధాటిని ప్రదర్శించాడు. భారీ షాట్లతో స్కోరును పెంచాడు. 277 బంతుల్లో డబుల్ సెంచరీ చేసేశాడు. 19 ఫోర్లు, 7 సిక్స్‌ లతో 209 పరుగుల (290 బంతుల్లో) వద్ద అండర్సన్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు.కాగా, అతి చిన్న వయస్సులోనే డబుల్ సెంచరీ కొట్టిన మూడో భారత బ్యాటర్‌ జైశ్వాల్. వినోద్‌ కాంబ్లి రెండు డబుల్ సెంచరీలు (21 ఏళ్ల 35 రోజులు, 21 ఏళ్ల 55 రోజులు) చేశాడు. సునీల్ గావస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) కూడా చిన్నవయసులోనే ద్విశతకం బాదాడు. వీరిద్దరూ యశస్వి కంటే ముందున్నారు. జైశ్వాల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో డబుల్ సెంచరీ కొట్టాడు. భారత్‌ నుంచి డబుల్‌ సెంచరీ చేసిన ఎడమచేతివాటం బ్యాటర్లు గంగూలీ, కాంబ్లి, గంభీర్‌ మాత్రమే. వీరి తర్వాత జైశ్వాల్ నిలిచాడు. ఇక అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ద్విశతకం చేసిన ఆరో భారత బ్యాటర్ యశస్వి. 10వ ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (3), వినోద్ కాంబ్లి (4), గావస్కర్, మయాంక్‌ అగర్వాల్ (8), పుజారా (9) ముందున్నారు. గావస్కర్‌, మయాంక్‌ తప్ప మిగతావారంతా ఇంగ్లాండ్‌పైనే చేయడం విశేషం.

అదే అజాద్ మైదానం.. అదే బ్యాక్ గ్రౌండ్

కాంబ్లీ, యశస్వి ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే, ఇద్దరూ ముంబైకి చెందినవారే. ఇద్దరూ టాప్ ఆర్డర్ బ్యాటర్లే. అన్నిటికీ మించి ఇద్దరిదీ సాధారణ నేపథ్యం. ముంబైలో మురికివాడలకు సమానమైన ప్రాంతంలో పుట్టాడు కాంబ్లీ. ఇరుకు వీధుల్లో ఆడుతూ అనేక అడ్డంకులు దాటుకుని ఆజాద్ మైదాన్ లో క్రీకెట్ ఆడడం మొదలుపెట్టాడు. ఇక జైశ్వాల్ కూడా అంతే. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పుట్టి.. క్రికెట్ పై ప్రేమతో ముంబై చేరిన అతడు టెంట్ లో ఉంటూ పానీ పూరి బండి వ్యాపారికి సాయం చేస్తూ కలను నెరవేర్చుకున్నాడు. అయితే, ఇప్పుడిప్పుడే జైశ్వాల్ భారత క్రికెట్ సంచలనంగా ఎదుగుతున్నాడు. దీనిని క్రమశిక్షణతో కొనసాగిస్తే అతడు దేశానికి గొప్ప కిరకెటర్ అవుతాడు.