Begin typing your search above and press return to search.

15 ఏళ్లలో ఆ దిగ్గజ క్రికెటర్ ఎన్నడూ ఇలా చేయలేదు

అందుకే కెరీర్ తొలినాళ్లలో ఫామ్ కోల్పోయి వేటు పడిన సందర్భం తప్పితే.. లేదా స్వయంగా విశ్రాంతి తీసుకున్న సమయంలో తప్ప మరెప్పుడూ జట్టుకు దూరంగా లేడు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:30 AM GMT
15 ఏళ్లలో ఆ దిగ్గజ క్రికెటర్ ఎన్నడూ ఇలా చేయలేదు
X

భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజాల్లో అతడు ఒకడు.. మిగతా ఇద్దరు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ ఇద్దరిలోనూ లేని ప్రత్యేక నైపుణ్యం అతడి సొంతం. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ ఫిట్ నెస్ పరంగా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. అందుకే కెరీర్ తొలినాళ్లలో ఫామ్ కోల్పోయి వేటు పడిన సందర్భం తప్పితే.. లేదా స్వయంగా విశ్రాంతి తీసుకున్న సమయంలో తప్ప మరెప్పుడూ జట్టుకు దూరంగా లేడు. విశ్రాంతి తీసుకున్న సందర్భంలోనూ ఒకటీ, రెండు మ్యాచ్ ల తర్వాత తిరిగి జట్టుతో చేరేవాడు.

ఇప్పుడే ఎందుకిలా..?

రికార్డుల రారాజు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ కు పూర్తిగా దూరమయ్యాడు. సొంతగడ్డపై అందులోనూ టెస్టులను ఎంతో ఇష్టపడే కోహ్లి.. ఇంగ్లండ్ వంటి జట్టుపై జరుగుతున్న సిరీస్ కు ఆసాంతం దూరంగా ఉంటాడని ఎవరూ ఊహించి ఉండరు. మొదట హైదరాబాద్ టెస్టు కోసం నగరానికి వచ్చి అదే రోజు వెళ్లిపోయాడు. రెండో టెస్టు కోసం విశాఖపట్నం వస్తాడని భావించినా రాలేదు. ఇక రాజ్ కోట్ లో మూడో టెస్టు నుంచి జట్టుతో కలుస్తాడనుంటే అదీ లేదు. నాలుగో, ఐదో టెస్టూ ఆడబోవడం లేదు. తొలుత తల్లికి అనారోగ్యం కారణంగానే కోహ్లి జట్టుకు దూరం జరిగాడని, భార్య రెండోసారి గర్భవతి కావడంతో ఆమెతో ఉండేందుకు వెళ్లాడనే కథనాలు వచ్చినా అవేవీ నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లి అసలు ఎందుకు ఆడడం లేదనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.

ఎన్నడూ ఇలా లేదు..

కోహ్లి 2008లో వన్డే, 2010లో టెస్టు కెరీర్ మొదలుపెట్టాడు. అప్పటినుంచి ప్రదర్శన సరిగాలేక, ఫామ్ కోల్పోయిన సందర్భాల (తొలినాళ్లలో) లో మాత్రమే పూర్తి స్థాయి సిరీస్ లకు దూరంగా ఉన్నాడు. కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలతో మాత్రమే తప్పుకొన్నాడు. అలాంటిది తనకెంతో ఇష్టమైన టెస్టులకు దూరంగా ఉంటాడని ఊహించలేం. అందులోనూ విరాట్ ఇప్పుడు ఉత్తమ ఫామ్ లో ఉన్నాడు. టి20లు కూడా ఆడాలనుకుంటున్నాడు. మరి అలాంటి వాడు ఇంగ్లండ్ తో టెస్టులను ఎందుకు వదిలేస్తాడు..? ఏదిఏమైనా అతడే దీనికి సమాధానం చెప్పాలి.